వైయస్సార్‌సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు జంప్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో మరికొందరు పార్టీలు మారే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి టిడిపిలో అంత ఆశాజనంగా ఏమీ లేదని అంటున్నారు. పార్టీ మారిన ఎమ్మేల్యేలకు, ఆయా నియోజక వర్గ టిడిపి ఇన్‌చార్జ్‌లకు అసలు పడటం లేదని, వీరి మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయని సమాచారం. తాజాగా వైసీపీ సీనియర్ నేత , నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ సభ్యుడు, వైసీపీ కీలకనాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీని వీడి టిడిపిలో చేరుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో ఘోర అవమానం తప్పదని వ్యాఖ్యానించాడు. ఆయన మాటలు నిజమయ్యే విధంగానే ఉన్నాయని ఇప్పటికే పార్టీ మారిన నేతలు కూడా అంగీకరిస్తుండటం విశేషం. తాజాగా జరిగిన మినీ మహానాడులో టిడిపి సీనియన్ నేత, ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... పార్టీలు మారే వారిని పొద్దు తిరుగుడు పువ్వులతో పోల్చాడు. బెల్లం చుట్టూ ఈగలు, చీమలు చేరినట్లే అధికార పార్టీవైపు ప్రతిపక్ష నాయకులు పదవి కోసం, ఇతర అవసరాల కోసం చేరడం సహజమని, కానీ ఇలాంటి నేతల విషయంలో టిడిపి అధిష్టానం కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. దీంతో వేదికపైనే ఉన్న కదిరి ఎమ్మేల్యే, ఇటీవలే వైయస్సార్‌సీపీ నుండి టిడిపిలో చేరిన చాంద్‌భాషా సభ నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు.
ఇక అద్దంకిలో గొట్టిపాటి రవి, కరణం బలరాంల మధ్య గొడవలు రోజురోజుకూ పెరుగుతూ బౌతిక దాడులకు వరకు వెళ్లాయి. తాజాగా టిడిపిలో చేరిన ఎమ్మేల్యే ఆదినారాయణరెడ్డి సీఎం అపాయింట్‌మెంట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా ఆయనకు అపాయింట్‌మెంట్ దక్కలేదనే బాధలో ఉన్నాడు. కడపలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య, కర్నూల్‌లో భూమానాగిరెడ్డి, శిల్పా సోదరుల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టిడిపిలో చేరిన ఎమ్మేల్యేలను ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. మొత్తానికి ఈ విషయంలో చంద్రబాబు మరింత చూపు సారించడం అన్ని విధాలుగా మంచిదని, లేకపోతే పరిస్థితులు చేయి దాటే విధంగా ఉన్నాయని కార్యకర్తలు కోరుతున్నారు.