సరైన సినిమాలు తీసి జనామోదం పొందాలి కానీ ఖాళీ చేసుకుని మరీ ట్వీట్ లు చేస్తూ అభిమానులను అవమానపరచకూడదు. ఈ విషయం రామ్ గోపాల్ వర్మ గ్రహిస్తే మంచిది. మహేష్ బాబుపై సెటైర్లు వేస్తూ కొన్ని ఉచిత సలహాలు ఇచ్చారు. వాటిలో శోభన్ బాబు ప్రస్తావన ఉంది. దేవత సినిమా కథ గుర్తుందట, అందులో హీరో గుర్తులేడట. అడవిరాముడు, ఏజెంట్ గోపి హీరోలు గుర్తున్నారట, ఆ చిత్రాల కథలు గుర్తులేవట. ఇది వితండవాదన, వర్మ సినిమాలు చూస్తే కథ, హీరో రెండూ గుర్తుండవు. ఆయనకీ విషయం గుర్తుందోలేదో. చెల్లెలి కాపురం, దీపారాదన, స్వయంవరం, మహరాజు, మల్లెపువ్వు వంటి సినిమాలు వర్మ చూడలేదేమో, చూస్తే శోభన్ బాబు నటన గుర్తుండేది. ఇక ఎన్టీఆర్ అనురాగదేవత, దేవత (పాతది), రక్తసంబంధం, తల్లాపెళ్ళామా, కోడలు దిద్దిన కాపురం వంటి చిత్రాలు చేయలేదా, ఇవి కుటుంబకథలు కాదా, ఆయన వారసుడు బాలకృష్ణ మంగమ్మగారి మనవడు, ముద్దుల మేనల్లుడు, తల్లిదండ్రులు చిత్రాల్లో నటించలేదా, హీరో కృష్ణ విషయానికి వస్తే ఆయన చిత్రాల్లో ఎక్కువ భాగం కుటుంబకథలతోనే రూపొందాయి. మరి మహేష్ ఫ్యామలీ స్టోరీ చిత్రంలో నటిస్తే వర్మకు వచ్చిన సమస్య ఏమిటీ?
ఎన్టీఆర్, కృష్ణ గురించి చెప్పడం బానే ఉంది కానీ, శోభన్ బాబు ప్రస్తావన తేవడం అంటే ఆయన హీరోయిజాన్ని వర్మ కించపరిచినట్టుగానే అభిమానులు భావిస్తున్నారు. వర్మ పనికిరాని విమర్శలు చేసి నొప్పించకూడదు.
ఇతర హీరోలకు పనిగట్టుకుని సూచనలు, సలహాలు ఇచ్చే వర్మ తను తీసిన సినిమాల గురించి ఆలోచిస్తే మంచిది. తాను తీసిన తెలుగు చిత్రాల్లో నటించిన హీరోలందరికీ వర్మ ఫ్లాప్ లిచ్చేశారు. ఆయన తీసినవి యాక్షన్, ఫాక్షన్ కథలేకదా, అవి ఎందుకు విజయం సాధించలేదు. ఈ ప్రశ్న ఆయనే వేసుకుని సమాధానం చెబితే బావుంటుంది.