మహేష్ టాలీవుడ్‌లో నెంబర్‌వన్‌గా ఎదుగుతూ.. సూపర్‌స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆయనకు 'ఖలేజా, ఆగడు, వన్' వంటి ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. కానీ ఈ సినిమాలు ఓ వర్గం ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా ఓవర్‌సీస్ ఆడియన్స్‌ను బాగానే మెప్పించాయి. మహేష్ అభిమానులు కూడా 'ఖలేజా' మంచి డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అనీ, 'ఆగడు'లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని, 'వన్' చిత్రం ఇంటలెక్చువల్ మూవీ అని ఏదో ఒక ప్లస్ పాయింట్‌ను పట్టుకొని ఆయా చిత్రాల ఫలితాలపై ఎంతో కొంత పాజిటివ్ ప్రచారం చేశారు. కానీ 'బ్రహ్మోత్సవం' చిత్రం విషయంలో మాత్రం సైలెంట్ అయిపోయారంటే పరిస్తితి అర్దం అవుతోంది. ఈచిత్రం గురించి చెప్పుకోవడానికి వారి వద్ద ఒక్క ప్లస్ పాయింట్ కూడా లేదు. ఇక ఈ చిత్రంలో మహేష్ నడత, నడక, నటన, పాటల్లో స్టెప్పులు.. ఇలా అన్నింటిలోనూ విఫలమై తన కెరీర్‌లోనే మొదటి సారిగా ఫెయిలయ్యాడు. ఈ చిత్రానికి కావాల్సిన హంగులు, బడ్జెట్ ఎంతైనా పెట్టగల నిర్మాత, సినిమా నిండా పెద్ద పెద్ద ఆర్టిస్టులు... ఇలా అన్నీ ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో శ్రీకాంత్ అడ్డాల దారుణంగా విఫలమయ్యాడు.
వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే శ్రీకాంత్ అడ్డాల చెప్పింది ఒకటి.. తీస్తోంది మరోకటి అని గ్రహించిన మహేష్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడని వార్తలు వచ్చినా మహేష్ ఫ్యాన్స్ మాత్రం అలాంటిదేమీ లేదని వాదిస్తూ వచ్చారు. ఇక ఈ చిత్రం ద్వారా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు, మహేష్ భావించి, రెండు భాషల్లో గుర్తింపు ఉన్న ఆర్టిస్ట్‌లకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మహేష్‌కు పరిస్థితి అర్దమైపోయిందని, తన మొదటి చిత్రాన్నే ఇలా తమిళంలో రిలీజ్ చేస్తే పరువుపోతుందని భావించిన మహేష్ తమిళ వెర్షన్ జూన్‌లో విడుదల చేద్దామనే వంకతో వాయిదా వేశాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ విషయంలో మహేష్ కాస్త దూరదృష్టితోనే వ్యవహరించాడని చెప్పవచ్చు. బహుశా తమిళ వెర్షన్ రిలీజ్ అసలు ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.