'బ్రహ్మోత్సవం' సినిమాపై ఎన్నో అంచనాలు. శ్రీమంతుడు వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత వచ్చిన మహేష్ సినిమా. తెరనిండా ఆర్టిస్టులే. ఖర్చుకు వెనుకాడని నిర్మాత. అయినప్పటికీ సినిమా ఫలితం నిరాశపరిచింది. ఇలాంటి సినిమా తీసినందుకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలపై అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు.
ఒక స్టార్ హీరో సినిమా అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. హీరోయిజం కనిపించాలి. అభిమానులకు హుషారు కలిగించే సంభాషణలు ఉండాలి. ఆసక్తి కలిగించే కథ, కథనం ప్రధానం. ఇవేమి లేకుండా సినిమా తీసి చూడమంటే ఎలా చూస్తారు?. మూడు సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాలకు ఆ మాత్రం అవగాహన లేదనుకోవాలా?. కథనం చకచక సాగాలి కానీ, సాగదీసినట్టుగా ఉండకూడదు. ఈ మాత్రం అవగాహన లేకుండా శ్రీకాంత్ అడ్డాల జనాల మీదకు సినిమా తీసి వదిలారు.
'బ్రహ్మోత్సవం' నిర్మాణం వెనుక కోట్ల వ్యాపారం ఉంది. వందలాది మంది పెట్టుబడి ఉంది. హీరో ఇమేజ్ ఉంది. దర్శకుడు ఇవేమి ఆలోచించినట్టు కనిపించదు. టీవీ సీరియల్ అనిపించేలా మహేష్ వంటి స్టార్ హీరోతో బ్రహ్మోత్సవం తీసినందుకు శ్రీకాంత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అరుదైన అవకాశాన్ని ఆయన చేజేతులా పాడు చేసుకున్నాడు. చెప్పినదానికి తీసినదానికి అసలు సంబంధమే లేకుండా పోయింది.
'బ్రహ్మోత్సవం' సినిమా అనుకున్న విధంగా లేదే అనే బాధ అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పుడు వారి ఆగ్రహం అంతా దర్శకుడిపైనే ఉంది. సినిమా అంటే ఇంత పరిహాసమా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
హీరోల ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోకుండా తీయడం అంటే క్షమించరాని నేరమని వారు ఆగ్రహిస్తున్నారు. వీటన్నింటికి శ్రీకాంత్ అడ్డాల సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 'శ్రీకాంత్ కొంపముంచావయ్యా...' అని అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నష్టం జరిగాక, నివారణ చర్యల్లో భాగంగా లెంగ్త్ తగ్గించడం వల్ల ఫలితం ఉంటుందా? ఈ జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాల్సింది.