సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్నే అనర్ధాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఒక వర్గం వారు తమకు వ్యతిరేకంగా ఉన్న మరో వర్గం వారిని టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక హీరో అభిమానులు మరొక హీరో గురించి యాంటీగా మాట్లాడుకోవడానికి సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇది మరి కాస్త ఎక్కువైంది. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన 'బ్రహ్మోత్సవం' సినిమాకు మొదటి షో నుండే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ కొందరు ఇది బ్రహ్మోత్సవం కాదు.. బోరోత్సవం అనే కామెంట్స్ చేస్తున్నారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా రిలీజ్ అయిన తరువాత ఫ్లాప్ టాక్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ అందరూ.. సామాజిక మాధ్యమాలలో ఇష్టం వచ్చినట్లు సినిమా గురించి కామెంట్స్ చేసుకున్నారు. కొందరైతే సినిమా రిలీజ్ కు ముందే నెగెటివ్ ప్రచారం చేశారు. దీంతో ఇప్పుడు తమ వంతు వచ్చిందన్నట్లు పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. 'బ్రహ్మోత్సవం' సినిమాపై జోకులు వేసుకుంటున్నారు. అభిమానులకు ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో సినిమా గురించి నెగెటివ్ ప్రచారం చేయడం వలన తమ సినిమా కలెక్షన్స్ పడిపోతాయనే బాధను నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే గనుక కొనసాగితే భవిష్యత్తులో సినిమా పరిస్థితి దారుణంగా మారే పరిస్థితులు ఏర్పడతాయని సినీ పెద్దలు విశ్లేషిస్తున్నారు.