జర్నలిస్ట్ ల రిక్రియేషన్ కోసం ఏర్పడిన ప్రెస్ క్లబ్ (హైదరాబాద్) ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుత కార్యవర్గం అభివృద్ది కార్యక్రమాలు చేపట్టక విమర్శలు ఎదుర్కొంది. అదే పోటీ అభ్యర్ధులకు వరమైంది. ఇటీవలే కొత్త మెంబర్ షిప్ ల విషయంలో పెద్ద దుమారం చెలరేగింది. ఎన్నడూ లేని విధంగా నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లింది. దీంతో భయపడిన ప్రస్తుత కార్యవర్గం అడిగిన వారందరికీ సభ్యత్వం ఇచ్చింది.
ఆదివారం జరిగే ఎన్నికల్లో ప్రధానంగా నాలుగు ప్యానెల్స్ పోటీ పడుతున్నాయి. ఇండిపెండెంట్ గా మరికొందరు పోటీలో ఉన్నారు. మహిళా జర్నలిస్ట్ ల కోసం ప్రత్యేకంగా కొన్ని పదవులు ఉన్నాయి. సుమారు 800 పై చిలుకు జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న క్లబ్ పై పెత్తనం కోసం ఈ సారి తెలంగాణ బ్రాండ్ తో అభ్యర్థులు రంగప్రవేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జర్నలిస్ట్ సభ్యులు చాలా మంది ఉన్నప్పటికీ, ఎన్నికల్లో ప్రాంతీయవాదం పనిచేయకపోవచ్చని భావిస్తున్నారు. ఈనాడు,సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, నమస్తే తెలంగాణ ఇంకా టీవీ ఛానల్స్ లో పనిచేసే జర్నలిస్టులు నామినేషన్స్ వేసి ప్రచారం చేస్తున్నారు. కొందరు అభ్యర్ధులు జర్నలిస్టులను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇంకొందరు అభ్యర్థులు జర్నలిస్ట్ ల బకాయిలను చెల్లించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
పోటీ అభ్యర్ధులందరూ ప్రెస్ క్లబ్ ను అభివృద్ది చెస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఈ సారి ఫోటో జర్నలిస్టులు ఎక్కువమంది పోటీ చేస్తుండడం విశేషం.