త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి చంద్రబాబు ఝలక్ ఇవ్వనున్నాడనే వార్త ప్రస్తుతం అంతటా హల్‌చల్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఏపీ నుండి నలుగురుకి అవకాశం ఉంది. ఒక సీటు వైసీపీకి పోగా మిగిలిన మూడు స్దానాల్లో ఒక స్దానాన్ని చంద్రబాబు తన మిత్రపక్షమైన బిజెపికి ఇస్తాడని అందరూ భావించారు. కానీ ఆ మూడో స్దానాన్ని కూడా చంద్రబాబు తమ పార్టీకే పరిమితం చేయనున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. చంద్రబాబు మోడీని కలిసిన తర్వాత ఒక సీటును మోడీ తనను అడగలేదని, అసలు ఆ ప్రస్తావనే రాలేదని తేల్చిచెప్పాడు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ బాబును ఆంద్ర భవన్‌లో ప్రత్యేకంగా కలుసుకుంది. ఆ తర్వాత కూడా బాబు మాట్లాడుతూ... రాజ్యసభ సీటు విషయం తమ మద్య చర్చకు రాలేదని, ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. తమకు వచ్చే మూడు సీట్లే కాకుండా వైసీపీకి దక్కే నాలుగో స్ధానంపై కూడా చంద్రబాబు కన్నుపడింది. నాలుగో స్దానానికి పోటీ పెట్టి వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నాడు. ఇక ఈ ఎన్నికల్లో వెంకయ్యనాయుడు ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు వెళ్లతాడనే విషయంపై కూడా హాట్ చర్చ నడుస్తోంది. తమ రాష్ట్రం నుంచి ఇక వెంకయ్యనాయుడుకు సీటు ఇచ్చేది లేదని, ఇంతకాలం తమ పార్టీ తరపున వెంకయ్యకు సీటు కేటాయిస్తే ఆయన కర్ణాటకకు చేసింది ఏమీ లేదని, ఎంత సేపు ఆంధ్రా జపం చేస్తున్నాడని కర్ణాటక బిజెపి వర్గాలు, ప్రజలు కోపంతో ఉన్నారు. మరి ఈ నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడుల రాజ్యసభ సీటు విషయంలో బిజెపి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సివుంది...!