వైయస్సార్‌సీపీ నుంచి ఎమ్యెల్యేలు టిడిపిలోకి జంప్ చేస్తుండటంతో తన పార్టీ మనుగడను ఎలా నిలబెట్టుకోవాలా? అనే అంశంలో జగన్ తలమునకలై ఉన్నాడు. అందుకోసం ఆయన ప్రమాదకరమైన అడుగు వేస్తున్నాడు. రాయలసీమలో ప్రాంతీయ విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో టిఆర్‌ఎస్ నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండీ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ఎడారిలా మారుతుందనే విష ప్రచారాన్ని చేస్తున్నాడు. తద్వారా రాయలసీమ ప్రాంతాన్ని టిడిపి నిర్లక్ష్యం చేస్తోందనే అనుమానపు విత్తనాలు ప్రజల్లో మెలకెత్తేలా పథకం రచిస్తున్నాడు. గతంలో ఇలాంటి విద్వేషపూరిత ఉద్ధేశాలను తెలంగాణ ప్రజల్లో మొలకెత్తేలా చేసి తెలంగాణ విషయంలో తన ఎత్తుగడను సాకారం చేసుకున్న కేసీఆర్ తరహాలోనే ప్రస్తుతం జగన్ కూడా నడుస్తున్నాడు.
ఎంతసేపు చంద్రబాబును విమర్శించడం, కార్నర్ చేయడం తప్ప కేసీఆర్‌ను జగన్ టార్గెట్ చేయడం లేదు. దీంతో ప్రజల్లో కేసీఆర్‌తో కుమ్మక్కు అయ్యే ఈ విధంగా చేస్తున్నాడనే విమర్శలు మొదలయ్యాయి. దీంతో జగన్ ఈసారి కాస్త కేసీఆర్‌ను కూడా హిట్లర్‌తో పోలుస్తూ విమర్శలు చేస్తున్నాడు. అయినా జగన్ జల దీక్షను కర్నూల్‌లో చేయడం ఏమిటి? తెలంగాణలో లేదా ఢిల్లీలో ఈ దీక్ష చేయాలి కానీ కర్నూల్‌లో చేస్తే ఏం లాభం అని ప్రజలతోపాటు వైయస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా గుసగుసలాడుకుంటున్నారు. అప్పట్లో జగన్ పట్టిసీమను కూడా విమర్శించాడు. కానీ జ్యోతుల నెహ్రూ పట్టిసీమకు అనుకూలంగా మాట్లాడేసరికి జగన్ ఖంగుతిన్నాడు. మొత్తానికి ఈమద్య తనకు దూరమైపోతున్న రెడ్డి సామాజిక వర్గాన్ని మరలా తనపైపు తిప్పుకోవడం, తన సొంత జిల్లాలు, మరీ ముఖ్యంగా కర్నూల్ జిల్లా నుండి టిడిపిలోకి వలసలకు అడ్డుకట్ట వేసే వ్యూహంతోనే జగన్ రాయలసీమను మరీ ముఖ్యంగా కర్నూల్‌ను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది.