జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు. ఆ రోజున ఘనంగా సంబురాలు చేసుకోవాలని తెరాస పార్టీ, ప్రభుత్వం నిర్ణయించుకున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. సరిగ్గా అదే రోజు కేసీఆర్ తేనెతుట్టిని కదుల్చుతున్నారు. దశాబ్దాలుగా డిమాండ్ ఉన్న ప్రత్యేక జిల్లాల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. కొత్తగా 15 జిల్లాలను, హైదరాబాద్ ను నాలుగు జిల్లాలుగా ఆయన ప్రకటించనున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో చాలా పట్టణాలు జిల్లా హోదా కోసం ఎదురుచూస్తున్నాయి. రాజకీయ కోణంతో కొత్తవి ఏర్పాటు చేసిన పక్షంలో వివాదాలు చెలరేగడం ఖాయమని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల ఒత్తడితో పాత ప్రపోజల్స్ పక్కన పెట్టేసే పక్షంలో స్థానిక ఉద్యమాలు మొదలు కావడం ఖాయం. అలాగే కొన్ని నియోజకవర్గాలను కొత్త జిల్లాల్లో కలిపిన పక్షంలో ప్రజాప్రతినిధులే వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాలు వస్తే పరిపాలన వికేంద్రీకరణ ఉంటుంది. స్థానికంగా అభివృద్ది జరుగుతుందనేది నిజమే అయినప్పటికీ ఎలాంటి వివక్షత లేకుండా ఏర్పాటు చేయగలిగితేనే ప్రజలు హర్షిస్తారు. లేదంటే కేసీఆర్ కు సొంత రాష్ట్రంలో తలనెప్పి తప్పదు. రాష్ట్రాన్ని విభజించి రెండు రాష్ట్రాలు ఏర్పాటుచేసినంత సులువుకాదు కొత్త జిల్లాలనేవి. ఇక హైదరాబాద్ ను నాలుగు జిల్లాలుగా ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. విభజించడం వల్ల హైదరాబాద్ స్వరూపమే మారుతుంది. దీనిని హైదరాబాదీలు ఎంతవరకు స్వాగతిస్తారనేది అనుమానమే. ఒకేసారిగా 15 కొత్త జిల్లాలను ఏర్పాటుచేయడం సాహసమే అవుతుంది. ఈ ప్రక్రియ తేనెతుట్టలాంటిదే. దీనిని కదిలిస్తే తేనె వస్తుందా లేక తేనెటీగలు మీదపడి కరుస్తాయా అనేది వేచిచూడాలి.