2014లో జరిగిన ఎన్నికల్లో అందరూ ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అవుతాడని, ఆయన పార్టీ వైయస్సార్‌సీపీ స్వీప్ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణమాఫీ అనేది ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసి చంద్రబాబు, టిడీపీలు అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. కాగా నిన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో కూడా ప్రీపోల్ సర్వేలు జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేనే విజయం సాధిస్తుందని తేల్చాయి. కానీ ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం డిఎంకే విజయం సాధిస్తుందని, మరోసారి కరుణానిధికి ముఖ్యమంత్రి పీఠం సొంతమవుతుందని తేల్చి చెప్పాయి. వాస్తవానికి ఎన్నికల ముందు జయలలిత ఓటర్లను ఆకర్షించేందుకు అన్నీ ఉచితం అని ప్రచారం చేయడంతో ఇక అమ్మ గెలుపు ఖాయమని అందరూ భావించారు. కానీ చెన్నై వరదలు, జయలలిత అవినీతి, ఆమె నిరంకుశ ధోరణి వంటి వాటితో పాటు చంద్రబాబు తరహాలో చివరి నిముషంలో కరుణానిధి తీసుకున్న రుణమాఫీ పథకం ఫలితాలను తారుమారు చేసింది. చంద్రబాబు పదవి యోగానికి కారణమైన రుణమాఫీనే రేపు కరుణానిధికి కూడా ఆ యోగం పట్టడానికి కారణమవుతోందని ఎగ్జిట్‌పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.