నిత్యం తెలంగాణకు జై అంటూ కేసీఆర్ కు భజన చేసే నమస్తే తెలంగాణ పత్రికకు తెలంగాణ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా సోమవారం నుండి కర్నూలులో జగన్ చేస్తున్న జలదీక్ష గుర్తుకురాకపోవడం విచిత్రం. బంగారు తెలంగాణ నిర్మాణంలో కొన్ని శక్తులు అడ్డుగా ఉన్నాయంటూ నిత్యం రాతలు రాసే నమస్తే.. జగన్ జలదీక్షపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మన రాష్ట్రం.. మన పత్రిక అంటూ చెప్పుకునే నమస్తే.. పత్రిక వైకాపా నేత జగన్ దీక్షకు వ్యతిరేకంగా ఎలాంటి కథనాలు ప్రచురించకపోవడం పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, జగన్ మధ్య పైకి కనిపించని బంధం ఉందని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తాజా చర్యలు ఊతమిస్తున్నాయి. నమస్తే దృష్టిలో ఆంధ్రా అంటే కేవలం చంద్రబాబు మాత్రమేనా, జగన్ కాదా? అని తెలంగాణ విపక్షాలు అనుమానిస్తున్నాయి. వైకాపా తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా ఉంటూ తెరాసలో చేరిన పొంగులేటి కూడా చేరిక సమయంలో జగన్ వైఖరిని విమర్శించారు. ఆ మాత్రం ధైర్యం నమస్తే తెలంగాణ పత్రికకు లేకపోయింది. అయితే ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమేనా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఆంధ్రలో చంద్రబాబును ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయనడానికి ఇది మరో ఉదాహారణ. ఈ కారణంగానే జలదీక్షను చూసిచూడనట్టుగానే పక్కన పెట్టేసింది నమస్తే పత్రిక.