గుడ్డ కాల్చీ ముఖం మీద వేయడం, ఆపై మసి అంటిందని హేళన చేయడం. ఈ మాటలు దివంగత వై.యస్. రాజశేఖరరెడ్డి తరచుగా చెప్పేవారు. తమ లోపాలు గమనించకుండా ఎదుటి వ్యక్తులపై ఆరోపణలు చేసినపుడు ఆయన ఈ మాటలు ప్రస్తావించేవారు. ఆయన ఫోటో వేసుకునే సాక్షి పత్రిక కూడా సరిగ్గా అదే బాటలో వెళుతోంది. ఆదివారం మొదటిపేజీలో తెదేపా (టి) తాళం అని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఖాళీ చేస్తారని ప్రచురించింది. ఈ వార్త రాసే ముందు కొన్ని విషయాలు మరిచింది. వైకాపా గురించి సాక్షికి గుర్తుకురాని విషయాలు చాలా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, ఓటమి చెందడంతోనే హైదరాబాదలోని వైకాపా కార్యాలయానికి తాళం వేసుకున్నారు. ఇటీవలే తెలంగాణ వైకాపా తెరాసలో సంపూర్ణంగా విలీనమైంది. పైగా పార్టీకి చెందిన ఏకైక ఎంపి. పొంగులేటి తెరాసలో చేరుతూ ఇచ్చిన ప్రకటనను సాక్షి ప్రముఖంగా వేసుకుంది. మరోవైపు ఆంధ్రలో వైకాపా నుండి తెదేపా వైపు వలససు కొనసాగుతున్నాయి. ఇన్ని లోపాలున్న వైకాపాను వదిలేసి ఊహాజనితమైన తెలంగాణ తెదేపా వార్తను ప్రచురించి సంతృప్తి చెందింది సాక్షి. మేము సమర్దించే పార్టీకి నష్టం జరిగింది, మీకు జరగాలి అని ఓ మీడియానే కోరుకోవడం విచిత్రం.
తెలుగుదేశం పార్టీపై రాతలు రాస్తూ ఒక ముఖ్యనేత అన్నాడు, ఒక ఎమ్మెల్యే చెప్పాడు అంటూ టేబుల్ వంటకానికి ఇతరుల పేర్లు వాడేస్తున్నారు. తెదేపాను అప్రదిష్టపాలు చేయడం ద్వారా జగన్ కు సాక్షి చేయాలనుకునేది ఏమిటీ, దీనికి బదులుగా ప్రజల్లో మమేకమై పార్టీని పటిష్టం చేస్తూ పోరాడమని సూచిస్తే బావుంటుంది. జగన్ పై ఆంధ్ర ప్రజలకు ఇంకా నమ్మకం ఉంది. అయితే సాక్షిలో వచ్చే ఏకపక్ష కథనాలు ఆ నమ్మకాన్ని చెడగొట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.