కార్యకర్తగా, ఉద్యమాల్లో పాల్గొని, ఎన్నికల్లో గెలుపుకోసం కృషి చేసిన వారికి పార్టీలు అధికారంలోకి వస్తే పదవులతో గౌరవించడం సహజం. కానీ ఇవేమీ లేకుండానే రెడీమేడ్ గా పదవులు పొందేవారు కూడా ఉంటారు. వారే ఉన్న పళంగా జండా మార్చే నేతలు. సరిగ్గా ఇదే ట్రెండ్ తెలంగాణలో నడుస్తోంది. తెరాస నడిపిన ఉద్యమంలో పోరాడినవారికి, త్యాగాలు చేసిన వారికి దక్కని పదవులు పార్టీ మారిన నేతలకు సులువుగా వరిస్తున్నాయి. ఉద్యమం కోసం జీవితాలను త్యాగం చేసినా ఎలాంటి గౌరవం దక్కని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వీరందరినీ కాదని ఇతర పార్టీల్లో ఉన్నపుడు తెరాసను, కేసీఆర్ ను ఉతికి ఆరేసిన నేతలు పార్టీ ఫిరాయించి పదవులు అనుభవిస్తున్నారు.
శ్రీనివాసయాదవ్, తుమ్మల నాగేశ్వరరావు వంటి మాజీ తెదేపా నేతలు తెరాసలో చేరి ఏకంగా మంత్రులయ్యారు. ఉద్యమకాలంలో కాంగ్రెస్ లో ఉన్న డి.శ్రీనివాస్ కు పదవిలేనిదే ఉండలేరనే పేరుంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కట్టబెట్టలేదని ఓవర్ నైట్ కండువా మార్చేసి తెరాసలో చేరారు. అంతరరాష్ట్ర వివాదాల పరిష్కార కర్తగా సలహాదారుగా లక్ష రూపాయల జీతంతో పదివి దక్కించుకున్నారు. ఆయన హయంలో అంతరరాష్ట్ర వివాదాలు ఏవి పరిష్కారమయ్యాయో ఆ దేవుడికే తెలియాలి. సొంత నియోజకవర్గంలో అనేక సార్లు ఓటమిపాలైన డి.శ్రీనివాస్ కు తెరాస తరుపున రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టే ప్రయత్నాలు పార్టీలో విస్మయానికి గురిచేస్తున్నాయి.
15 సంవత్సాలుగా పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, డి.యస్.కు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడం పట్ల తెరాస శ్రేణులు చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ కే చెందిన డి.యస్. ను రాజ్యసభకు ఎంపికచేయడంలో కవిత ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.సి.నేత వి.హనుమంతరావు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ ఖాళీలో బి.సి. కోటాలో డి.యస్. ను ఎంపికచేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తెరాసలో డి.యస్. కంటే బి.సి.లు లేరా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది.
వలసలను ప్రోత్సహిస్తే వారికే పదవులు కట్టబెడుతున్న కేసీఆర్ తాత్కాలికంగా లబ్ది పొందినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం ఇబ్బంది పడతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.