పదవి పోయాక రాజకీయ నాయకుడి పరిస్థితి ఎలా ఉంటుందో, ఫ్లాపులు తీశాక నిర్మాత సైతం అలాగే ఉంటాడు. దిల్ రాజును చూస్తే ఇదే గుర్తుకువస్తుంది. సుప్రీమ్ సినిమా ప్రమోషన్ కోసం తరచుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దిల్ రాజు తనకు తాను సీనియర్ అయిపోయినట్టు, ఇతరులకు బాధ్యతలు అప్పజెపుతున్నట్టు ప్రకటించారు. సుప్రీమ్ సినిమాను ప్రమోట్ చేయడం కోసం నానా తంటాలు పడుతున్నారు.
విచిత్రం ఏమంటే సునీల్ తో తీసిన కృష్ణాష్టమి ఫ్లాప్ అని అంగీకరించడం. మీడియాకు రేటింగ్ కూడా ఇవ్వరాదని ఆరోపణలు చేసి, తనకు తాను సెల్ఫ్ రేటింగ్ ఇచ్చుకున్న దిల్ రాజు కృష్ణాష్టమి చిత్రం సూపర్ హిట్, ఫ్యామిలి హిట్ అంటూ అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడేమో ఫ్లాప్ అని ఒప్పుకున్నాడు. అంటే కృష్ణాష్టమి గురించి ప్రేక్షకులకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆయన అంగీకరించారన్నమాట. దీనివల్ల తన ప్రకటనలో విశ్వసనీయతను కోల్పోయారు. సినిమా ప్రమోషన్ కోసం ఆ మాత్రం జిమ్మిక్కులు తప్పవని సమర్థించుకున్నప్పటికీ ఇక ముందు చెప్పే ఆయన మాటలు జనాలు నమ్మరని దిల్ రాజు గ్రహించారు. ఈ రోజున సుప్రీమ్ సినిమా గురించి చెబుతున్నదాంట్లో వాస్తవం ఉందా అనే అనుమానం అందరికీ కలుగుతుంది.
అల్లు అరవింద్ స్క్రూల్ ను పాటిస్తున్న దిల్ రాజు క్రమక్రమంగా నిర్మాతగా వెనుకబడిపోతున్నారు. స్టార్ హీరోల డేట్లు ఆయనకు దొరకడం గగనమైంది. ఇప్పుడేమో పవన్ కల్యాణ్ తో తీస్తాను అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అంటే ఇప్పటి వరకు పవన్ తో సినిమా చేసే స్థాయికి తను చేరుకోలేదని అంగీకరించినట్టే. మహేష్ బాబు, వెంకటేష్, జు.ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్స్ తో సినిమాలు తీసినా పవన్ పాట పాడడం అంటే ఇతర స్టార్స్ ను తక్కువచేసి చూపడమే అని అనుకోవచ్చు. వరుసగా వస్తున్న ఫ్లాపుల వల్ల దిల్ రాజు గందరగోళంలో పడ్డారు. మరోవైపు భాగస్వాములతో కలిసి బిల్డర్ గా భారీ వ్యాపారం చేస్తున్నారు. సినిమాల కంటే ఇదే బెటర్ అని ఆయన భావిస్తున్నట్టుంది.