దర్శకదిగ్గజం అయిన కె.బాలచందర్ తన చివరి కోరికగా 'కడవుల్ కన్బొమ్ వా' స్క్రిప్ట్‌ను తయారుచేసుకొని ఆ చిత్రాన్ని తెరకిక్కించాలని భావించారు. అంతలో ఆయన కుమారుడైన కైలాసం కన్ను మూశారు. ఆ తర్వాత కొద్దికాలానికే బాలచందర్ కూడా స్వర్గస్తులైనారు. కాగా తెలుగులో 'శంభో శివ శంభో, సంఘర్షణ, జెండాపై కపిరాజు' చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు, నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సముద్రఖని బాలచందర్‌గారికి ప్రియమైన శిష్యుడు. బాలచందర్ తన చివరి 'కడవుల్ కన్బొమ్ వా' చిత్రం తీయాలని భావించినప్పుడు సముద్రఖనిని పిలిచి ఆ చిత్రం స్క్రిప్ట్‌ను నెరేట్ చేసి, ఈ చిత్రానికి తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయాలని, అలాగే చిత్రంలో ఓ కీలకపాత్రను పోషించాలని 2014లో సముద్రఖనిని కోరారు బాలచందర్. వాస్తవానికి ఈ చిత్రాన్ని బాలచందర్ తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తీయాలని సన్నాహాలు చేశారు. ఇప్పుడు ఆ స్క్రిప్ట్‌ను తానే స్వయంగా తెరకెక్కించడానికి సముద్రఖని సంసిద్దుడు అయ్యాడు. ప్రస్తుతం ఖని తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, నటిస్తున్న చిత్రం 'అప్పా'. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బాలచందర్‌గారి డ్రీమ్ ప్రాజెక్ట్‌ను 'కడవుల్ కన్బొమ్ వా' చిత్రాన్ని తీయాలని సముద్రఖని సిద్దమయ్యాడు. మొత్తానికి బాలచందర్ చివరి స్క్రిప్ట్‌ను తెరకెక్కించే అదృష్టం సముద్రఖనికి దక్కడం నిజంగా అదృష్టమనే చెప్పాలి.