తన హయాంలో అవినీతికి చోటు లేదని, అవినీతికి పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, అవినీతిరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతానని ఎప్పుడు సమయం దొరికినా, మైకు చేతిలో ఉంటే చాలు చెప్పిందే చెబుతుంటారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. వాస్తవానికి అధికారులు నిజాయితీతో పనిచేస్తుంటే వారిపై ఒత్తిడి తెచ్చి, చివరకు వారిని బదిలీలు చేయించేది కూడా అధికార పక్ష ప్రజాప్రతినిధులే. నిజాయితీగా పనిచేసే వారిని పనిగట్టుకుని వేధించేది ఈ నాయకులే. కాగా దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా విశాఖపట్టణం కమిషనర్ అమిత్ గార్గ్ ని చెప్పవచ్చు. ఈమధ్యకాలంలో వైజాగ్‌లో భూదందాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని వెనుక మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసులు ఉన్నారనేది అక్షరసత్యం. వీరు చేస్తున్న భూదందాలను కమిషనర్ అమిత్ గార్గ్ అడ్డుకుంటూనే వస్తున్నాడు. వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తనదైన నీతినిజాయితీలతో ఆయన విశాఖ వాసులకు ప్రియమైన వ్యక్తిగా మారారు.
కానీ ఇప్పుడు ఆయన్ను పనిగట్టుకొని బదిలీ చేయడంపై విశాఖ వాసులు భగ్గుమంటున్నారు. గంటా, అవంతిలు ఇప్పటికే పలుసార్లు అమిత్ గార్గ్ ని కలుసుకొని చూసిచూడనట్లు వ్యవహించారని కోరారని విశ్వసనీయ సమాచారం. కానీ ఆయన మాత్రం వారి బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగలేదు. దీంతో ఈ ఇద్దరు నేతలు విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఉన్నంతకాలం తమ ఆటలు సాగవని సీఎంకు మొర వినిపించారు. దాంతో చంద్రబాబే స్వయంగా కలుగజేసుకొని ఆయన్ను బదిలీ చేశాడని విశాఖలోని ఇతర పార్టీల నాయకులతో పాటు వైజాగ్ వాసులు కూడా చర్చించుకుంటున్నారు. మరి నీతులు చెప్పే చంద్రబాబు ఇలా సంఘవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న తన పార్టీ వారిని మందలించి చక్కదిద్దాల్సింది పోయి ఇలా నిజాయితీ కలిగిన అధికారిని బదిలీ చేయడం ప్రజల్లో ఎలాంటి సంకేతాలను పంపుతుందో ఆలోచించాల్సిన అవసరం లేదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.