మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం ఈనెల 20న విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఇప్పటికే మిక్కీ.జె.మేయర్ అందించిన ట్యూన్స్ బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్న మణిశర్మ ఈ ప్రాజెక్ట్ నుండి తాజాగా బయటకు వచ్చాడని, ఆ స్ధానంలో ఈ చిత్రానికి ఆర్.ఆర్‌ను అందించడానికి గోపీసుందర్ ఎంటర్ అయ్యాడని సమాచారం. గతంలో మహేష్-శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి కూడా మణిశర్మ అద్బుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను ఇచ్చి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతేకాదు... మహేష్ బాబు హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి ఆయన చిత్రాలకు మణిశర్మ మంచి సంగీతాన్ని అందిస్తూ వస్తున్నాడు. ఈ విధంగా ఆయనకు మహేష్‌తో మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. మరి అలాంటి మణిశర్మ 'బ్రహ్మోత్సవం' ప్రాజెక్ట్ నుండి ఎందుకు బయటకు వచ్చాడు? సినిమా విడుదలకు చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో మణిశర్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? అసలు ఈ వార్త నిజమేనా? నిజం కాకపోతే చిత్ర యూనిట్ దీనిపై స్పందిస్తే బావుంటుంది. ఎందుకంటే మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అంటే ప్రేక్షకుల్లో ఓ పాజిటివ్ ఎనర్జీ వుంటుంది మరి.