సినిమా తీయడమే కాదు.. ఈ పోటీ ప్రపంచంలో ఆ చిత్రానికి మంచి పబ్లిసిటీ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కూడా చాలా కీలకం. ఈ విషయంలో '24' టీమ్ వినూత్న ప్రచారానికి తెరతీసింది. చాలా కొత్త స్ట్రాటర్జీతో ముందుకు సాగుతోంది. ఈ సరికొత్త ఆలోచనను ఇచ్చింది మాత్రం తెలంగాణ ఐటి శాఖామంత్రి కేటీఆర్. ఆయన '24' చిత్రం చూసిన తర్వాత తన పిల్లలిద్దరు '24' చిత్రంలోని వాచ్ లాంటిది కావాలని అడుగుతున్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేశాడు. దాంతో అదే సలహాలను దృష్టిలో ఉంచుకొని '24' చిత్రం డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, ఇరోస్ ఇంటర్నేషనల్స్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి తమ సినిమా చూసిన పిల్లలకు ఓ వాచిని గిఫ్ట్‌గా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అసలే వేసవి సెలవులు కావడం, పిల్లలందరూ సైన్స్ ఫిక్షన్ చిత్రమైన '24' చిత్రం చూసేందుకు ఆసక్తి చూపిస్తుండటం, దీంతో ఈ చిత్రానికి రోజురోజుకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. దీంతో ఈ వాచ్‌గిఫ్ట్ అనేది తమ చిత్రం కలెక్షన్లను మరింతగా పెంచుతుందని యూనిట్ భావిస్తోంది. ఈ వాచ్ గిఫ్ట్ కేవలం 8సంవత్సరాల లోపు పిల్లలకే అందిస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ సరదాగా చేసిన ట్వీట్ నుండి ఈ వినూత్న ప్రచారం మొదలైంది అని చెప్పవచ్చు.