రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 24న 15రాష్ట్రాలకు సంబంధించిన 57రాజ్యసభ స్దానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 2 స్దానాలకు, ఏపీ నుండి 4 స్దానాలకు పోటీ జరగనుంది. తెలంగాణలో వి.హనుమంతరావు, గుండు సుధారాణి స్ధానాలకు పోటీ జరగుతుంది. ఈ రెండు స్దానాలు టిఆర్‌ఎస్‌కే దక్కనున్నాయి. ఒక స్దానాన్ని కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు ఇస్తారనే ప్రచారం ఊపందుకొంది. మరోసీటును కేసీఆర్ ఎవరికి ఇస్తారు? అనే అంశం ఆసక్తికరం. ఇక ఏపీ నుండి సుజనాచౌదరి, జెడీ శీలం, జైరామ్‌రమేష్, నిర్మాలా సీతారామన్ స్దానాలు ఖాళీ అవుతున్నాయి. కర్ణాటక నుండి ఎన్నికైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు టర్మ్ కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో రెండు స్ధానాలు టిడిపికి, ఒక స్ధానం దాని మిత్ర పక్షమైన బిజెపికి, మరో స్దానం వైయస్సార్‌సీపీకి దక్కుతాయి. వైయస్సార్‌సీపీ తరపున విజయసాయిరెడ్డికి స్ధానం ఇవ్వాలని జగన్ భావిస్తున్నాడు. కానీ బలం లేకపోయినా కూడా నాలుగో స్దానానికి కూడా టీడీపీ పోటీ చేయడం ఖచ్చితంగా కనిపిస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేసే అవకాశం లేకపోవడంతో వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా తమకు ఓటు వేస్తారని, క్రాస్ ఓటింగ్ జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నాడు. తెలంగాణ విషయంలో రెండు సీట్లు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. కానీ ఏపీలో మాత్రం ఈ ఎన్నికలు మంచి వేడిని రాజేసే అవకాశాలు ఉన్నాయి.