కిందటి ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి తరపున 15మంది ఎమ్మేల్యేలు గెలవగా, అందులో 12 మంది ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌లోకి జంప్ అయ్యారు. ఇక మిగిలిన ముగ్గురు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్.కృష్ణయ్య. కాగా తెలంగాణ టిడిపికి అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన ఆ పార్టీ నేత ఎల్.రమణ కూడా టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను, మంత్రి హరీష్‌రావును కలిసి ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. కానీ రమణ మాత్రం ఇవ్వన్నీ పుకార్లే అని కొట్టిపారేస్తున్నాడు. వాస్తవానికి తెలంగాణ టిడిపి అధ్యక్షుడైన ఎల్.రమణ కంటే చంద్రబాబు టిటిడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్‌రెడ్డికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయంలో రమణ మనస్దాపానికి గురవుతున్నట్లు సమాచారం. ఇక రమణ విషయానికి వస్తే ఆయన గత ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుండి పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ నియోజకవర్గంంలో టిఆర్‌ఎస్ కూడా ఓడిపోయింది. దాంతో ఆ నియోజకవర్గంలో బలపడటం కోసం రమణను ఉపయోగించుకునే పనిలో టిఆర్‌ఎస్ ఉందని సమాచారం. అదే రమణ కూడా టిఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోతే అది తెలంగాణలో టిడిపికి పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. మరోవైపు ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు తెలంగాణ విషయంలో ఎలాంటి ఉత్సాహం చూపించడం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తన మనుగడకే ప్రమాదమని భావించిన రమణ టిఆర్‌ఎస్‌లో చేరాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడని తెలుస్తోంది.