ఉత్తరాఖండ్ విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు, అక్కడ మరలా ప్రదీప్‌రావత్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంతో బిజెపికీ భారీగానే షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా అదే జరగనుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి పట్టం కట్టిన ప్రజలు రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం బిజెపికి ఓటు వేయడం లేదు.దానికి ఢిల్లీ, బీహార్ వంటి అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజాగా జరుగుతున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా బిజెపికి వ్యతిరేకంగానే ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బిజెపి పరువు మరికొంత పోవడం ఖాయం. ఈ మినీ ఎన్నికలు కేంద్రంలోని బిజెపి సర్కార్ పనితీరుకు రెఫరెండమ్ అని ప్రతిపక్షాలు చాలెంజ్ చేసినప్పటికీ ఆ చాలెంజ్‌ను బిజెపి స్వీకరించలేకపోయింది. దీంతోనే ఆయా రాష్ట్రాల్లో బిజెపి ఎలాంటి ఫలితాలు సాధించనుందో అర్దం అవుతుంది. మన దౌర్భాగ్యం ఏమిటంటే మన దేశంలో ఉన్న రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి రెండు దొందు దొందే. దీంతో మరో ప్రత్యామ్నాయం ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. పోనీ తృతీయ ఫ్రంట్‌కు అధికారం ఇచ్చినా అందులో ఒకే ఒరలో ఇమడలేని కత్తులు చాలా ఉన్నాయి. చివరకు వారు వారు కొట్టుకొని అసలుకే మోసం తెస్తారనే విషయం ఎప్పుడో స్పష్టం అయింది. మొత్తానికి రాబోయే రెండు మూడేళ్లలో కూడా బిజెపి పాలన మారకపోతే వచ్చే ఎన్నికల్లో బిజెపికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.