ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన కేసీఆర్ ఆయనతో దాదాపు గంటా ముప్పై నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్బంగా మోడీ.. కేసీఆర్‌తో రాజకీయపరమైన చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 'మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ' పథకాలు మోడీని బాగా ఆకట్టుకున్నాయనే వార్తలు వినిపించాయి. సమావేశ వివరాలను కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి చెబితే ప్రధాని మోడీ కేసీఆర్‌ను పొగుడుతూ ట్వీట్ చేశాడు. కాగా ఏపీలో కూడా చంద్రబాబు పలు అభివృధ్ది పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 25సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను, ప్రధానిని కలిసి తమ అభివృధ్ది గురించి వివరించి చెబుతూనే వస్తున్నారు. కానీ ఇప్పటివరకు చంద్రబాబు పనితీరుపై మోడీ ప్రత్యేక అభినందనలు తెలియజేసిన సందర్బం లేదు. కానీ కేసీఆర్‌ను మాత్రం ఆయనతోపాటు కేంద్రమంత్రులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. త్వరలో రాజకీయ పునరీకరణకు దీనిని సంకేతంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను, ఏపీలో వైయస్సార్‌సీపీలను ఎన్డీఏలో చేర్చుకొని టిడిపి దూరంగా పెట్టాలనే బిజెపి అధినాయకత్వం ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే బిజెపి అధినాయకత్వం అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణలో బిజెపి, టిడిపి పొత్తు ముగిసింది. రాబోయే రోజుల్లో ఏపీలో కూడా అదే పరిణామం జరుగనుందని తెలుస్తోంది. పవన్‌కళ్యాణ్, సోము వీర్రాజు వంటి వారి సహాయంతో కాపులను, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు వంటి నేతల సహాయంతో కమ్మ సామాజిక వర్గాన్ని.. ఇలా ఏపీలో ఆపరేషన్‌ను మొదలు పెట్టి సొంతంగా బలపడాలని బిజెపి అధిష్టానం భావిస్తోందిట.