ఇప్పటికీ మిత్రపక్షంగానే ఉన్నప్పటికీ బిజెపిపై టిడిపి నేతలు, టిడిపిపై బిజెపీ నేతల విమర్శల యుద్దం కొనసాగుతోంది. అయితే ఈ మాటల తూటాలు ఇరు పార్టీల అధిష్టాన నేతలు కాకుండా, కింది స్దాయి నేతల నుండి ఎదురవ్వడం జరుగుతోంది. కాగా టిడిపితో పొత్తు వల్ల బిజెపికి కలిసొచ్చిన లాభాలు ఏమీ లేవని, ఇంకా చెప్పాలంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర బిజెపి నాయకులు దుయ్యబడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి టిడిపితో కటీఫ్ చెప్పేసి తమ సొంత ఉనికిని రాష్ట్రంలో చాటుకోవాలని ఏపీ బిజెపి నేతలతోపాటు తెలంగాణ బిజెపి నేతలు కూడా భావిస్తున్నారు. దాంతో బిజెపి, టిడిపి నాయకుల మద్య మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా ఏపీ బిజెపి నాయకులు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి అధికారం చేజిక్కించుకోవడానికి కారణం ప్రధాని మోడీ, పవన్‌కళ్యాణ్ వల్ల మాత్రమే జరిగిందని వారి వాదన, పోనీ మోడీ వల్ల టిడిపికి ఎంపీ సీట్లు వచ్చి ఉంటాయే కానీ అసెంబ్లీ సీట్లు మాత్రం మోడీ వల్ల తమకు ఎలా వస్తాయని టిడిపినేతలు ఎదురుప్రశ్నిస్తున్నారు. ఇక పవన్ వల్ల కొద్దిపాటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయని, ఓట్లు చీలకుండా ఉండటానికి మాత్రమే పవన్ మద్దతు ఉపయోగపడిందని టిడిపి నేతలు వాదిస్తున్నారు. ఇందులో కూడా కాస్త వాస్తవం ఉంది. మోడీ, పవన్‌ల వల్ల టిడిపికి ఉడతాసాయం లభించిందే తప్ప మొత్తం టిడిపి గెలుపు కేవలం మోడీ, పవన్‌ల వల్లే వచ్చిందనే వాదన మాత్రం అర్దరహితమని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. రోజులు గడిచే కొద్ది ఈ మాటల యుద్దం ఏ స్దాయికి చేరుతుందో.. అనే అంచనాలు వేస్తున్నాయి రాజకీయ వర్గాలు!