గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి-టిడిపిల కూటమికి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మద్దతిచ్చారు. కీలకమైన సమయంలో ఆయన ఇచ్చిన మద్దతు ఆ రెండు పార్టీలకు బాగా ఉపయోగపడింది. కానీ 2019 ఎన్నికల్లో పవన్ 'జనసేన' పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగడం ఖాయమైంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ 2019 ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసే అవకాశం ఉందా? లేక పవన్ ఒంటరిగానే పోటీ చేస్తారా? అనే విషయంలో మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పవన్ టిడిపికి మాత్రం సపోర్ట్ చేసే అవకాశం లేదని అర్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్‌కు పోటీగా తమ పక్షాన మహేష్‌ని వాడుకుంటే ఎలా ఉంటుందా? అనేది టిడిపి వర్గాల ఆలోచన. అందుకు అస్త్రంగా టిడిపి నాయకుడు, మహేష్ బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను వాడుకోనున్నారని అర్దమవుతోంది. ఇటీవల మహేష్ తన సొంత ఊరు అయిన గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెంను దత్తత తీసుకొని ఆ గ్రామంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం కేవలం మహేష్‌బాబు వ్యక్తిగత పర్యటనలా కాకుండా తెలుగుదేశంపార్టీ అధికారిక పర్యటనలా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఆయన బుర్రిపాళెం సందర్శించిన సమయంలో ఆయన ఫ్యాన్స్ కంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎక్కువగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన సొంత కార్యక్రమాలకు తోడుగా ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన ప్రచారకర్తగా పనిచేశారనే విమర్శలు వస్తున్నాయి.
ఇదంతా టిడిపి వ్యూహంలో భాగంగానే జరిగిందనే వాదన వినిపిస్తోంది. మహేష్ చేత టిడిపి నాయకులు డ్వాక్రా మహిళలకు కోటిరూపాయల రుణాలను పంపిణీ చేయించడం, ప్రభుత్వ కార్యక్రమమైన నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయించడం జరిగింది. వీటన్నింటిని చూసినవారు మహేష్ టిడిపి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారని అంటున్నారు. అయితే మహేష్ పర్యటన కేవలం తన బావ గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్‌కు మాత్రమే పరిమితమని, ఆయన నియోజకవర్గం వరకు మాత్రమే మహేష్ ఉంటాడని, అంతేగానీ దీన్ని అలుసుగా తీసుకొని ఆయన ఏకంగా అన్నిచోట్లా టిడిపికి అనుకూలంగా ఇదే తరహాలో వ్యవహిరించే అవకాశం లేదని అంటున్నారు. మహేష్‌కు ఇప్పుడే రాజకీయల్లోకి వచ్చే ఉద్దేశ్యం గానీ, టిడిపికి మద్దతు ఇచ్చే అవకాశం కానీ లేదని కొట్టిపారేస్తున్నారు. పవన్‌లా మహేష్ తొందరపాటు వ్యక్తి కాదని, ఏ విషయమైనా ఆయన పూర్తిగా ఆలోచించి తొందరపడకుండా నిర్ణయం తీసుకుంటాడని.. కాబట్టి మహేష్ కేవలం ఈ పనంతా తన బావ కోసమే చేశాడు తప్ప టిడిపి కోసం కాదనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది.