రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కె.వి..పి. రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఈనెల 13వ తేదీన చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఈ బిల్లుపై ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ బిల్లు చర్చలో పాల్గొని ఓటు వేయాలని విప్ కూడా జారీ చేసింది. ఈ బిల్లుకు ఎం. వెంకయ్యనాయుడు, చంద్రబాబులు కూడా మద్దతు ఇవ్వాలని కేవీపీ కోరుతున్నాడు. అయితే ఈ విషయంలో అయినా మన ఎంపీలంతా కలిసికట్టుగా నిలబడి తమ వాయిస్‌ను వినిపిస్తారా? లేక అక్కడ కూడా రాజకీయ పట్టింపులకు, రాజకీయ కుయుక్తులకు పాల్పడతారా? అనేది వేచిచూడాల్సిన అంశం. వాస్తవానికి లోక్‌సభలో కాంగ్రెస్‌కు మెజార్టీ లేకపోవచ్చు. కానీ రాజ్యసభలో మాత్రం మంచి బలం ఉంది. ఈవిషయంలో రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా పోరాడాల్సివుంది. కానీ బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు చేయడానికి టిడిపి, వైయస్సార్‌సీపీలు సహకరిస్తాయా? అనేది అనుమానంగానే ఉంది. తెలంగాణ విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం, టిఆర్‌ఎస్.. ఇలా అన్ని పార్టీలు కలసిపోరాటం చేసి తామనుకున్నది సాదించాయి. మరి ఏపీ ఎంపీలకు కూడా అంత తెగువ, పోరాట పటిమ ఉన్నాయా? లేదా? అనేది కీలకాంశం. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తాము ఓటు వేయమనే నిర్ణయాన్ని తీసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. మొదటి బిల్లుకు అనుకూలంగా చర్చ జరిపి ఓటింగ్‌లో బిల్లుకు మద్దతు తెలపడం ఇప్పుడు మనందరి ముందు ఉన్న కర్తవ్యం. మరి ఏపీ ప్రజల ఆవేదన, మనోగతం ఈ రాజకీయ పార్టీలకు చెవులకు ఎక్కుతాయా? లేదా? అన్న విషయంలో స్పష్టత రావాల్సివుంది.