ఇంతకాలం తమ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తుంది అంటూ ప్రకటనలు చేసిన ఏపీ బిజెపి నేతలు కేంద్రంలోని తమ అధినాయకత్వం ప్రత్యేకహోదా ఇచ్చేది లేదిని తేల్చేయడంతో ఇప్పుడు వారు మొహాలు చాటేస్తున్నారు. ఇంతకాలం తమ పార్టీ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే... దానిని చూపి ఏపీలో బిజెపి బలం పెంచాలని ఉబలాటపడిన బిజెపి నేతలకు కేంద్రం నిర్ణయం ఇరుకున పడేసింది. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు బిజెపి మంత్రులు ఉన్నారు. ఒకరు కీలకమైన ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ కాగా రెండో మంత్రి దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు. ఇప్పుడు వీరికి పదవిగండం ఉంటుందేమో అనే దిగులు పట్టుకుంది. అయినా కేంద్రం ఇప్పటికిప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వడంలేదని అంత ఖరాఖండీగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది..? మరి కొంతకాలం నాన్చిన తర్వాత ఎన్నికల నాడు అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటే సరిపోయేది కదా...! అని వారు వాపోతున్నారు.
ఇక బిజెపి కేంద్రంలో ఘనవిజయం సాధించిన సమయంలో ఆ పార్టీలో చేరిన పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులకు కూడా ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటంలేదు. వారి వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం కేంద్రం ఇప్పటివరకు ఇచ్చిన నిధులను చంద్రబాబు ఎలా ఖర్చుపెట్టాడు? అని ఎదురు ప్రశ్నించడం తప్ప వారి నోటి వెంట ఏ కౌంటరు లేదు. మరోవైపు చంద్రబాబు కూడా తుది నిర్ణయంగా ఏమి తీసుకోవాలి? ఏ సమయంలో తీసుకోవాలనే డైలమాలో ఉన్నాడు. అందుకే ఆయన తన సహచర నాయకులను బిజెపిని టార్గెట్ చేయవద్దని, టార్గెట్ చేయడం మనకు మంచిచేయదు అని ఆదేశాలు జారీ చేశాడట. ఇక ఈ ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని కేంద్రమంత్రులు స్పష్టం చేయడంతో బిజెపిలో తానున్నంత వరకు ఏపీకి అన్యాయం జరగదని చెబూతూ వచ్చిన కేంద్రమంత్రి వెంకయ్యనాయడు ఇప్పుడు అసలు ఎక్కడా కనిపించడంలేదు.
విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు ప్రత్యేకహోదా చాలదని, దాన్ని పదేళ్లకు పెంచాలని రాజ్యసభలో నానా హడావుడి చేసిన వెంకయ్యనాయుడు, కేంద్రం ఖచ్చితంగా ప్రత్యేకహోదా ఇస్తుందని నమ్మించిన చంద్రబాబు నాయుడులే అసలైన నిందితులని ఏపీ ప్రజలు ఘాడంగా నమ్ముతున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ఇంకా కాంగ్రెస్ తప్పు చేసింది అనే వాస్తవాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశిస్తున్నాడు. అదంతా గతం. కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పు కాబట్టే ఏపీలో ఆ పార్టీకి ఒక్క సీటుగానీ, డిపాజిట్ గానీ రాలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉండబోతోంది. మరి ఎప్పుడో కాంగ్రెస్ చేసిన తప్పుకు జనం ఆల్‌రెడీ శిక్ష విధించారు. కానీ చంద్రబాబు మాత్రం పాడిందే పాడరా.. పాచిపళ్ల దాసుడా..! అనే సామెతను నిజం చేస్తున్నాడు.