స్టార్ల సినిమాలకి సంబంధించి ఏదైనా ఓ చిన్న క్లూ బయటికి రావడమే ఆలస్యం వెంటనే ఆన్‌లైన్లో సందడి మొదలవుతుంటుంది. అదంట ఇదంట అని మాట్లాడుకొంటుంటారు. మరికొంతమంది ఓ అడుగు ముందుకేసి పోస్టర్లు తయారు చేస్తుంటారు. అచ్చం సినిమా యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లా వుంటాయవి. ఆ తర్వాత చిత్రబృందమే బయటికొచ్చి అవి ఫ్యాన్ మేడ్ పోస్టర్లని చెప్పుకోవల్సి వస్తుంటుంది. ఇప్పటిదాకా అలా ఊరికే తయారు చేసిన పోస్టర్లు, టీజర్లు మాత్రమే బయటికొచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఓ పాట తయారైంది. అది బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం. ఆ పాట తయారు చేసింది ఎవరో కాదు.. ప్రముఖ గీత రచయిత సిరా శ్రీ. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర ప్రకటన వినగానే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథసత్యనారాయణగారు రాసిన ఆంధ్రప్రశస్తి చదివారట సిరాశ్రీ. అందులో గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన లఘుకావ్యం ఆయన్ని ఎంతో ఉత్తేజపరిచిందట. ఆ ఉత్తేజం పాట రాయడానికి స్ఫూర్తినిచ్చిందట. ఆ పాటకి కిల్లింగ్ వీరప్పన్, ఎటాక్ సినిమాల సంగీత దర్శకుడు రవిశంకర్ బాణీ కట్టాడు. గాయకుడు రోహిత్ పాడారు. సినిమాలోని పాటని తలపించేలా వున్న ఆ గీతం ఇప్పుడు ఆన్‌లైన్లో హల్‌చల్ చేస్తోంది. సినిమాకి వాడుకొనేంత క్వాలిటీ వుందని మాట్లాడుకొంటున్నాయి పరిశ్రమ వర్గాలు. అయితే ఈ పాటను కేవలం గౌరవసూచకంగా విడుదల చేసిందే తప్ప, దీనికి నందమూరి బాలకృష్ణ- దర్శకులు క్రిష్ గార్ల చిత్రానికి ఎటువంటి సంబంధమూ లేదనీ, రోమాంఛితమైన ఇంతటి గొప్ప చిత్రాన్ని తీస్తున్న దర్శకులు క్రిష్ గారికి, నటిస్తున్న బాలకృష్ణ గారికి తెలుగుజాతి ఎప్పటికీ ఋణపడి ఉంటుందని సిరాశ్రీ చెప్పారు.