ఎక్కడైనా సరే పరిపాలన సౌలభ్యం కోసం తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తారు. రాజకీయ అస్థిరతకు తోడ్పడేలా ఉంటే వాటికి మద్దతు పలుకుతారు. మీడియా కూడా దీన్ని స్వాగతిస్తుంది. కానీ సాక్షి పత్రిక పనికట్టుకుని వ్యతిరేకించడం మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక ఎమ్మెల్యే స్థానాలను పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. సంఖ్య పెరిగితే చాలామందికి రాజకీయంగా అవకాశం వస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది. కానీ నియోజకవర్గాల పెంపుపై సాక్షి పత్రిక పనిగట్టుకుని ప్రత్యేక కథనాలు ప్రచురిస్తోంది. ఇప్పట్లో పెరగవని, 2026 వరకు అవకాశమే లేదని మరో కథనాన్ని శనివారం ప్రచురించింది. ఇంత ఆసక్తితో రాయడం వెనుక ఉద్దేశం ఏమిటో అందరికీ తెలిసిందే. నిజానికి మీడియాకు సంబంధం లేని విషయం ఇది. అయితే సాక్షి రాతల వెనుక జగన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టే తరచుగా ఇలాంటి వార్తలను ప్రచురిస్తోందని రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. నియోజక వర్గాల పెంపు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న 175 స్థానాలు 225 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది ఊహించే చంద్రబాబు వలసలను ప్రోత్సహిస్తూ, అభ్యర్థులను సిద్దం చేసుకుంటున్నారు. ఇక్కడే జగన్ కు నచ్చలేదు. ఇప్పటికే పార్టీని కాపాడుకోవడానికి సతమతమవుతున్న జగన్ నియోజకవర్గాల పెంపు జరిగితే క్యాండిడేట్లను వెతుక్కోవాల్సి వస్తుంది. కొత్తగా పార్టీలో చేరేవారెవరూ లేరు. ప్రస్తుతం ఉన్న స్థానాలే ఉంటే తనకున్న బలంతో 2019 ఎన్నికల్లో గెలవవచ్చు అనేది ఆయన ఆలోచన. పెరిగితే మాత్రం ఇబ్బంది తప్పదు. అందుకే జగన్ మనసెరిగీ నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన వార్తలను సాక్షి తరచుగా ప్రచురిస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.