బయట విపక్షాల నుండే కాదు.. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల నుండి కూడా బాబుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జూన్ నెలాఖరు కల్లా గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద తాత్కాతిక సచివాలయం పూర్తికానుంది. ఇక అది పూర్తయితే అమరావతి నుండే పాలన సాగించాలని చంద్రబాబు భావిస్తున్నాడు. కానీ ఆయనకు సచివాలయ ఉద్యోగుల నుండి మాత్రం సమస్యలు తప్పడం లేదు. హైదరాబాద్‌ను వదిలి రావడానికి ఉద్యోగుల్లో అధిక శాతం మంది సుముఖంగా లేరు. ముఖ్యంగా రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న వారు ఈ వయసులో ఊర్లు పట్టి తిరగడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. కొందరైతే స్వచ్చంధ పదవీ విరమణ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే విఆర్‌ఎస్‌కు సంబంధించిన పది ఫైళ్లను ఆర్దికశాఖ కూడా ఓకే చేసింది. మరో 50 అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఠాకూర్ పదవి చేపట్టి 100రోజులు పూర్తి కాకుండానే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆయనకు చంద్రబాబు విషయంలో సరిగా పొత్తు కుదరడం లేదని సమాచారం. వాస్తవానికి ఠాకూరును కాకుండా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తీసుకోవాలని చంద్రబాబు ఆరాటపడ్డాడు. కానీ సీనియర్లు, ఠాకూర్‌కు పదోన్నతి కల్పించాలని బాబుకు నచ్చజెప్పడంతో ఆయన ఠాకూర్‌ను తీసుకున్నారు. కానీ ఐఎఎస్‌లు, ఐపిఎస్‌ల బదిలీల్లో తన మాటకు చంద్రబాబు విలువ ఇవ్వడం లేదని, తాను ఏది చెప్పినా చంద్రబాబు దానికి విరుద్దంగా మాట్లాడుతూ, అన్ని నిర్ణయాలను తన ప్రమేయం లేకుండా ఆయనే నిర్వహిస్తున్నాడని ఠాకూర్ మనస్తాపానికి గురయ్యాడట. చివరకు తనకు తెలియకుండానే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ అవుతున్నాయని ఠాకూర్ ఆవేదనగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఠాకూర్ కొద్దిరోజులు సెలవుపై వెళ్లనున్నాడు. దీనికి ఆయన ఏ కారణం చూపిస్తారో అని ఉన్నతాధికారులతో పాటు చంద్రబాబు కూడా ఆసక్తిగా ఉన్నాడట!