సెలబ్రిటీలకు జరిగే సన్మానాలు, సత్కారాల గురించి అనేక జోక్ లున్నాయి. ప్రతిభ ఆధారంగా కాకుండా తమవారిని పిలిచి శాలువ కప్పి సత్కరించే స్కీమ్ లు అనేక సంస్థలు చేస్తుంటాయి. అందుకే సంస్కృతిక సంస్థలు చేసే ఇలాంటి వాటి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
తాజాగా మోహన్ బాబుకు ఇలాంటి సత్కారమే జరిగింది. దాసరి స్వర్ణకంకణాన్ని ఆయనకు ప్రదానం చేశారు. వేడుకలో దాసరితో పాటుగా మోహన్ బాబు, శత్రుఘ్నసిన్హా, టి.సుబ్బరామిరెడ్డి ఇంకా పలువురు హాజరయ్యారు. బాలకృష్ణ వస్తాడని నిర్వాహకులు ప్రకటించినా ఆయన కనిపించలేదు.
అకస్మాత్తుగా మోహన్ బాబుకు స్వర్ణకంకణం ఇవ్వడం ఏమిటని చాలామందికి ఆశ్చర్యం కలిగింది. కేవలం దాసరి పుట్టినరోజు వేడుక కాబట్టి ఆయన ప్రియ శిష్యుడికి ఇవ్వాలని ఇచ్చేశారు. అంతే తప్ప ప్రత్యేక కారణం అంటూ కనిపించలేదు. అందుకే ఈ సత్కారానికి వార్తా పత్రికలు ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం సిటీ ఎడిషన్ లోనే ప్రచురించాయి.
గతంలో దాసరి పుట్టినరోజు అట్టహాసంగా జరిగేది. రవీంద్రభారతి వేదికపై అనేక మందికి సత్కారాలు, నగదు ప్రోత్సహకాలు ఇచ్చేవారు. ఉత్తమ దర్శకుడి అవార్డు, ఉత్తమ పాత్రికేయుడు అంటూ చెరో లక్ష రూపాయలు ఇచ్చేవారు. ఈ హడావుడి దాసరి కేంద్రమంత్రిగా ఉన్నపుడు ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన పదవి పోయింది. రాజ్యసభ సభ్యత్వం పోయింది. దాంతో హడావుడి తగ్గింది. పదవిలో ఉంటే ఒకలా లేకుంటే మరొకలా చేసుకోవడం దాసరికి అలవాటే. ప్రస్తుతం ఆయనపై బొగ్గు కుంభకోణం ఆరోపణలున్నాయి. చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. రాజకీయంగా ఎలాంటి ప్రగతి లేదు. దాదాపు ఖాళీగానే ఉన్నారు. తన ఉనికిని చాటుకోవడం కోసమే తనపేరుతో సత్కారాలు, కంకణాలు పెట్టారని అంటున్నారు.