Advertisementt

బాబు వ్యూహం బెడిసికొడుతుంది..!

Sat 07th May 2016 05:53 PM
chandrababu naidu,ys jagan,operation aakarsh,guntur,mla,tdp  బాబు వ్యూహం బెడిసికొడుతుంది..!
బాబు వ్యూహం బెడిసికొడుతుంది..!
Advertisement

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను, ఎమ్మెల్యే లను టిడిపిలో చేర్పించేందుకు చంద్రబాబు లేవదీసిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూల్‌ జిల్లా విషయానికి వస్తే భూమానాగిరెడ్డి, ఎస్వీమోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి.. ఇలా పలువురు టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు... పుచ్చుకుంటున్నారు. కానీ అలాంటి వారి రాకతో తమ మనుగడకు ఇబ్బంది ఏర్పడుతుందని ఆల్‌రెడీ టిడిపిలో ఉన్న నాయకుల్లో మదన ఎక్కువైంది. దాంతో వారు టిడిపిని వీడాలనే నిర్ణయానికి వస్తున్నారు. మాజీ మంత్రి కె.జి.వెంకటేష్‌, ఏరాసు ప్రతాపరెడ్డిలు వైకాపాలో చేరడానికి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదని తెలియడం కూడా దీనికి ఓ కారణంగా చెబుతున్నారు. కాగా ఇటీవల జరిగిన ఓ సంఘటన ఇద్దరు ఎమ్మేల్యేలకు షాకిచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మేల్యేలు టిడిపిలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. వారితో పలువురు టిడిపి నాయకులు మంతనాలు జరిపారు. మొదట్లో ఆ ఇద్దరు తమకు తమ నియోజకవర్గాల అభివృద్దికి నిదులిస్తే చాలని చెప్పారట. కానీ వారితో మంతనాలు జరిపే టిడిపి నాయకులు ఎక్కువ కావడంతో తమకు ఇంత డిమాండ్‌ ఉందా? అని భావించిన ఆ ఇద్దరు ఎమ్మేల్యేలు తమకు ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును జగన్‌ ఇస్తానని చెప్పాడని, కానీ ఇప్పటివరకు ఆయన ఇవ్వలేదని, కాబట్టి తమకు ఎన్నికల్లో అయిన ఖర్చును తిరిగి టిడిపి ఇవ్వాలనే డిమాండ్‌ పెట్టారు. మరోకరైతే తనకు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవి కావాలని కోరగా, మరో ఎమ్మేల్యే మంత్రిని చేస్తామని హామీ ఇవ్వాలని బెట్టు చేశారు. దాంతో చంద్రబాబు ఆ ఇద్దరు ఎమ్మేల్యేలు తమకు అవసరం లేదని స్దానిక నాయకులకు తెగేసి చెప్పమని చెప్పాడు. 

మరోవైపు ఈ ఎమ్మేల్యేలు ఎక్కడ టిడిపిలో చేరుతారో అన్న భయంతో జగన్‌ కూడా మధ్యవర్తిత్వంకి  విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపడంంతో ఇద్దరు ఎమ్మేల్యేలు తమకు ఉన్న డిమాండ్‌ను చూసి మురిసిపోయారు. కానీ ఉన్నట్లుండి టిడిపి వారిని పట్టించుకోవడం మానేసింది. మరోపక్క జగన్‌ కూడా పార్టీ మారాలని నిర్ణయించుకున్న వీరిద్దరిపై నమ్మకం లేక.. ఆ ఇద్దరు ఇప్పటికీ వైసీపీలో ఉన్నా పెద్దగా పట్టించుకోవడం మానేశాడని సమాచారం. మొత్తానికి ఈ ఇద్దరు ఎమ్మేల్యేల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయింది. కాగా ఇటీవల లోకేష్‌, జె.సి.దివాకర్‌రెడ్డిలు చంద్రబాబు తన మనవడిని కూడా పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ది కోసం నిరంతరం పాటుపడుతున్నారని సెంటిమెంట్‌ తెచ్చే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ సీనియర్‌ నాయకుడు ఆఫ్‌ది రికార్డ్‌గా మాట్లాడుతూ... కేవలం రాష్ట్రాభివృద్ది కోసమే బాబు కష్టపడుతుంటే ఆయనకు తన కుటుంబంతో గడపడానికి సమయం దొరికేదని, కానీ బాబు గారు ఎప్పుడు ఆపరేషన్‌ ఆకర్ష్‌ అంటూ మీద పడ్డారో అప్పటి నుండే ఆయనకు తీరిక లేకుండా పోయిందని సెటైర్లు వేశాడు. మరి ఇది కూడా నిజమే కదా..! అంటున్నారు ఈ విషయం తెలిసినవారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement