ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఇప్పటి హీరోలకు మేమేమి తీసిపోలేదని ఇంకా సినిమాల్లో నటిస్తూ.. తమ ప్రతిభను చాటుతూనే ఉన్నారు. చిరంజీవి 'కత్తిలాంటోడు' అంటూ.. తన 150వ సినిమాకు ప్రిపేర్ అవుతుంతుంటే.. బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' అంటూ తన 100వ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ నటిస్తున్నాడు. అయితే వెంకటేష్ కూడా తన 75వ సినిమా తన కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచిపోవాలని ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్, మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' సినిమాలో నటిస్తున్నాడు. ఇది తనకు 73వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది కానీ.. నయనతార వలన షూటింగ్ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. దీని తరువాత వెంకటేష్ 'నేను శైలజ' చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమలతో మరో సినిమాలో నటించడానికి అంగీకరించాడు. ఈ రెండు చిత్రాల తరువాత తన 75 వ సినిమా దర్శకుడిగా పూరి జగన్నాథ్ అయితే పెర్ఫెక్ట్ అని వెంకీ భావిస్తున్నాడట. ఇప్పటికే పూరి చెప్పిన ఒక లైన్ నచ్చడంతో వెంకీ ఓకే చేసినట్లు సమాచారం. పూరి ఈ కథను డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. ఒకవేళ ఈ కథ గనుక కుదరకపోతే తన అన్న కొడుకు రానాతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తే.. ఎలా ఉంటుందని కూడా వెంకీ ఆలోచిస్తున్నాడట. ఈ వార్తలు విన్నవారు ఇప్పటినుండే వెంకీ తన 75వ సినిమా కోసం బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడని మాట్లాడుకుంటున్నారు.