ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు రెండు అంశాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒకటి ప్రత్యేకహోదా.. రెండు తెలంగాణ కడుతోన్న అక్రమ ప్రాజెక్ట్‌లు. వాస్తవానికి చంద్రబాబుకు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణలో పట్టుసాధించాలనే కోరిక బలంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ విధానమే ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇక ఆయన తెలంగాణను పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. టిఆర్‌ఎస్ ఎత్తుగడలు, వ్యూహాలకు భిన్నంగా తామేదో జాతీయపార్టీ అని అతిగా ఊహించుకోకుండా ముందుగా తనను సీఎం చేసిన ఏపీకి న్యాయం చేయాలి. ఆయన వెంటనే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. తద్వారా కేంద్రంపై పోరాటం చేయాలి. ప్రత్యేకహోదా సాధించేందుకు ఆయన వెంటనే కార్యరంగంలోకి దూకాలి. పోరాటం చేసి ప్రత్యేకహోదా తీసుకొని వస్తే బాబుని ఏపీ ప్రజలు దేవుడిగా భావిస్తారు. మరలా మరోసారి అధికారం ఇస్తారు. పోనీ ప్రత్యేకహోదా కోసం పోరాటం చేసినా కూడా బిజెపి అందుకు ఒప్పుకోకపోతే ప్రజల్లో చంద్రబాబుకు మరింత సింపతీ పెరుగుతుంది. తన చేతనైనంత చేశాడనే భావన ప్రజల్లో వస్తుంది. పోనీ చంద్రబాబు అవినీతి, ఓటుకునోటు అంశాలను బిజెపి, టిఆర్‌ఎస్‌లు తెరమీదకు తెచ్చినా కూడా బాబును రాజకీయంగా వేదిస్తున్నారనే సింపతీ వస్తుంది. వాస్తవానికి జగన్ ఎంతో కాలంగా అనుసరిస్తున్న వ్యూహం కూడా అదే. ఆయన అవినీతి చేశాడని ప్రజలు నమ్ముతున్నప్పటికీ రాజకీయాల్లో అవినీతి చేయని వారు ఎవరు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీలోనే జగన్ ఉండి ఉంటే కేంద్రమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి వంటి పదవులు కూడా వచ్చేవి కదా...! కానీ ఆయన కాంగ్రెస్‌తో, సోనియాతో ఢీకొని మరీ కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లడం ఓటర్లలో ఆయనకు సింపతీని తెచ్చిపెట్టింది. అదే వ్యూహాన్ని ప్రస్తుతం చంద్రబాబు పాటిస్తే ఆయనకు విజయం వచ్చినా క్రేజ్ పెరుగుతుంది. ఆయనకు అపజయం వచ్చినా ప్రజల్లో సింపతీ పెరుగుతుంది. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడిన యోదునిగా బాబుకు ప్రజలు కిరీటం పెడుతారు.
ఇక మరో విషయానికి వస్తే.. ఆయన కేసీఆర్‌కు భయపడో లేక తెలంగాణలో మరింతగా బలహీన పడుతామనే ఉద్దేశ్యంతోనో తెలంగాణను ధీటుగా ఎదుర్కోవడం లేదనే భావన ఏపీ ప్రజల్లో ఉంది. అందువల్ల ఆయన ఇతర అంశాలను పక్కనపెట్టి ఏపీ కోసం పోరాడాలి. అంతేకానీ అలా చేస్తే తెలంగాణ ప్రజలు దూరమవుతారనే భ్రమను వీడాలి. ఆయన తన సత్తా చూపించి నిజంగానే ఆంధ్ర ను బాగా అభివృధ్ది చేస్తే... తెలంగాణ ప్రజలే ఆయనకు బ్రహ్మరథం పడుతారు. అంతేకానీ ప్రతి విషయానికి మీనమేషాలు లెక్కిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.