జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కిందటి ఎన్నికల్లో బిజెపికి అనూకూలంగా వ్యవహరించాడు. మిత్ర ధర్మం ప్రకారం బిజెపికి మద్దతుదారైన టిడిపికి కూడా ఆయన ప్రచారం చేసిపెట్టి, వారి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంతకాలం ఆయన టిడిపిపై అప్పుడప్పుడు తన అక్కసును బయటపెట్టాడే కానీ, బిజెపి విషయంలో మాత్రం మృదువుగానే మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు దేశంలోని అధికారపార్టీ అయిన బిజెపి ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పడంతో ఎప్పుడూ ప్రశ్నిస్తాను.. ప్రశ్నిస్తాను అని చెబుతూ వచ్చిన పవన్ ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన సమయం రానే వచ్చింది. రాజధానిభూముల విషయంలో టిడిపిని, చంద్రబాబును తప్పుపట్టిన పవన్ ఇప్పుడు ప్రత్యేకహోదాపై ఏమి మాట్లాడుతాడు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇకపై ఆయన కేంద్రంపై మృదువుగా మాట్లాడితే సరిపోదు. తన మనసులోని ఆవేదనను ప్రశ్నల రూపంలో స్పందించాలి. సుతిమెత్తగా మాట్లాడితే వీలుకాదు. ఆంధ్రుల ఆత్మగౌరవం ఇప్పుడు భగ్గుమంటోంది. ఇంతకాలం చంద్రబాబు, పవన్‌లు కేంద్రంలోని బిజెపి సర్కార్‌పై ఘాటుగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు బాబు కూడా స్వరం పెంచాడు. ఈ సమయంలో పవన్ ఎలా? ఏమి? మాట్లాడుతాడనే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ప్రత్యేకహోదా ఇవ్వకుంటే ఏపీలో బిజెపికి పుట్టగతులు ఉండవు. ప్రజలు కాంగ్రెస్‌లాగానే, బిజెపిని కూడా సమాధి చేస్తారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ భావిస్తున్నాడు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వకుంటే బిజెపితో ఆయన పొత్తు పెట్టుకుంటే అంతకు మించిన రాజకీయ అజ్ఞానం మరోటి ఉండదు. తన అన్నయ్యలా పవన్ తప్పు నిర్ణయం తీసుకోడనే భావిద్దాం. మొత్తానికి పవన్‌కళ్యాణ్ స్పందించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఈ పరిస్థితి ఇంత త్వరగా వస్తుందని పవన్ కూడా ఊహించివుండడు. మరోవైపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మద్య జరుగుతున్న జలవివాదంపై కూడా పవన్ స్పందించాలనే డిమాండ్ ఊపందుకొంటోంది. మరి ఈ రెండు అంశాలపై పవన్ ఎలా స్పందిస్తాడో వేచిచూడాల్సివుంది...!