ఏపీలో ప్రతిపక్షనేత జగన్‌కు చంద్రబాబు నాయుడు తెరతీసిన 'ఆపరేషన్ ఆకర్ష్'తో నిద్ర లేకుండా పోయింది. అయితే ఆయనకు అనుకోని వరంగా రెండు విషయాలు ఆయన చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయి. అందులో ఒకటి ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం లేదనే ఆంశంపై పాటు కృష్ణ, గోదావరి నదులపై తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లు. ఈ రెండింటితో ఆయన చంద్రబాబుపై పోరుకు సై అంటున్నాడు. జగన్ తెలంగాణ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా త్వరలో దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ విషయంపై ఇప్పటివరకు ఏమీ మాట్లాడని చంద్రబాబు కూడా టిఆర్‌ఎస్‌పై యుద్దం ప్రకటించాడు. అయితే ఈ రెండు అంశాలలోనూ జగన్ చంద్రబాబునే టార్గెట్ చేస్తాడు కానీ కేంద్రంపై ఆయన ఏమీ మాట్లాడలేడు. ఆయన పైపైనే కేసీఆర్‌పై విమర్శలు చేస్తాడు తప్ప ఆయన్ను టార్గెట్ చేయడు. ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అంటే చంద్రబాబుకు ఎంత భయం ఉందో జగన్‌కు అంతకు మించిన భయం ఉంది. కాబట్టి కేంద్రం విషయంలో ఆయన ఆచితూచి మాట్లాడుతాడు.
మరోవైపు వైసీపీ ఈ విషయాలలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్నిపార్టీలు ఏకమై పోయి ప్రత్యేకహోదా విషయంలో కలిసి పోరాడుదామని వైసీపీ నాయకులు పిలుపునిస్తున్నారు. ఇది కూడా జగన్ ఆడుతున్న గేమ్‌లో భాగమే. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు చంద్రబాబు కేంద్రంపై పోరాడే పరిస్థితులు కనిపించడంలేదు. కానీ వైసీపీ మాత్రం అన్ని పార్టీలు కలిసి ఉద్యమించి, కేంద్రానికి వ్యతిరేకంగా సకలం బంద్ చేద్దామని, సహాయనిరాకరణ చేద్దామని పిలుపునిస్తోంది. అసలు ఈ విషయంలో కేంద్రం వద్దకు, ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లడం లేదనే వాదనను వైసీపీ బాగా హైలైట్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు చంద్రబాబుకు మిగిలిన ఏకైక మార్గం వెంటనే ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోటీ చేయడమే. మరి బాబు మదిలో ఏముందో ఎవరికి తెలుసు...!