ఆ మధ్య పవన్‌కళ్యాణ్ ఓ సందర్బంలో తిడితే కేసీఆర్‌లా తిట్టాలి. ఎంత తిట్టినా పడివుండాలంటే అది ఆంద్రా ఎంపీలలాగా పడివుండాలి.. అని వ్యాఖ్యానించాడు. అది పచ్చి నిజం. ఇద్దరు ఎంపీలతో ప్రస్దానం సాగించి తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను చూసి మన ఎంపీలు ఇప్పటికైనా సిగ్గుపడాలి. మన ఎంపీలలో ఎక్కువ మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు కావడమే ఇందుకు కారణం, వారికి కాంట్రాక్టులు గానీ, ఇతర సౌకర్యాలు కానీ కావాలంటే అధికార పక్షంలో ఉండటమే వారికి కీలకం. రాష్ట్రంలోనే కాదు..కేంద్రంలోనూ అధికార పార్టీకి కొమ్ముగాస్తూ ఉంటేనే వారి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరుకాయలుగా వర్దిల్లుతూ ఉంటాయి. వారికి నియోజకవర్గ, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. తాజాగా సీనియర్ రాజకీయనాయకుడు, అనంతపురం టిడీపీ ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. వంద మంది పవన్‌కళ్యాణ్‌లు వచ్చినా ప్రత్యేక హోదా తేలేరని వ్యాఖ్యానించాడు. కానీ మరోవైపు రాష్ట్రంలోని మెజార్టీ వర్గం ప్రజలు పవన్ లాంటి వారు ఉద్యమాన్ని ప్రారంభించి రోడ్లపైకి వస్తే.. దాని స్ఫూర్తితో, మరోవైపు రాజకీయంగా తాము ఎక్కడ వెనక్కు వెళ్లిపోతామా? అనే ఇబ్బంది మిగిలిన నాయకులకు, పార్టీలను పట్టిపీడిస్తుందని, కాబట్టి ముందుగా ఈ విషయంలో పవన్ ముందుండి ఉద్యమాన్ని నడపాలని కోరుతున్నారు. మరి జెసీగారు అలా మాట్లాడటానికి కారణం ఏమిటి? తాము ఉద్యమం చేయరు సరికదా...! ఉద్యమం చేయాలని భావించే వారిని కూడా వెనక్కిలాగుతుంటారు. ఇక మన మరో ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ... బిజెపి కాస్త ఆలస్యమైనా కూడా ప్రత్యేక హోదా ఇస్తుందని చెబుతూ ప్రజలను ఇప్పటికీ అమాయకులుగా ట్రీట్ చేస్తున్నాడు. అనకాపల్లి టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ వాదన మరోలా ఉంది. ఆయన మాట్లాడుతూ... ఆంద్ర ప్రజలకు ఓపిక ఉండదని, ఎన్నికల్లో గెలిచింది మొదలు ప్రత్యేక హోదా ఎప్పుడు? ఎప్పుడు? అని నిలదీస్తుంటారని, తమకు తగినంత సమయం ఇవ్వరని మండిపడ్డాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి దాదాపు 15ఏళ్లు పట్టిందని, ప్రత్యేక హోదా కూడా అలాంటిదే అని, దీర్ఘకాలం పోరు చేస్తే గానీ అది రాదని సెలవిచ్చాడు. ఉత్తరాఖండ్‌కు రాష్ట్రం ఏర్పడిన రెండు సంవత్సరాల తర్వాతే ప్రత్యేక హోదా వచ్చిందని అవంతిగారు సన్నాయినొక్కులు నొక్కుతున్నాడు. ఇదండీ మన ఎంపీల వరస..! ఇదిలా వుంటే ఒక్క గల్లా మాత్రం ప్రత్యేక హోదా విషయం లో తనవంతు పోరాటం చేయడం ఇక్కడ కాస్త ఊరటనిస్తుంది.