బాఘీలో విలన్‌గా కనిపించి అదరగొట్టిన మహేష్ బావ సుధీర్‌బాబు ఇప్పుడో రీమేక్‌లో నటించేందుకు రంగం సిద్ధం చేసుకొన్నాడు. స్ట్రయిట్ కథలకంటే తమిళంలో హిట్టైన సినిమాని రీమేక్ చేస్తే మినిమం గ్యారెంటీ ఉంటుందని నమ్మి ఆయన స్టెప్ తీసుకొన్నట్టు తెలిసింది. తమిళంలో వచ్చిన ముందాసుపట్టి చిత్రం రీమేక్‌తో ఆయన నవ్వించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 2014లో విడుదలైన ముందాసు పట్టి చిత్రంలో విష్ణు, నందిత హీరో,హీరోయిన్స్ గా చేసారు. అక్కడ మంచి విజయం సాధించిందీ చిత్రం. 1980 నేపథ్యంలో ఓ విలేజ్‌లో సాగే కథ అది. ఆ ఊళ్లోవారిని ఎవరైనా ఫొటోలు తీస్తే చెడు జరుగుతుందని నమ్ముతుంటారు. ఈ పాయింట్ చుట్టూ సాగే ఈ కథలో బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ వుందట. అందుకే ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించాడు సుధీర్. మరి దానికి దర్శకత్వం వహించేది ఎవరన్నది త్వరలోనే తెలియనుంది.