ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అష్ట దిగ్బందనం చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇప్పటికే గత ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలలో బిజెపితో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన బిజెపి.. టిడిపి కి దూరంగా జరుగుతోంది. మరోవైపు జగన్ కూడా చంద్రబాబును ఇరకాటంలో పెట్టేలా తెలంగాణలో నిర్మితమవుతున్న పాలమూరుతో సహా పలు అక్రమ ప్రాజెక్ట్‌లను అడ్డుకోవాలని ఉద్యమం ఉదృతం చేస్తున్నాడు. కాగా కిందటి ఎన్నికల్లో బిజెపి -టిడిపి కూటమికి ప్రచారం చేసి కాపు ఓట్లను చంద్రబాబుకు పడేలా చేసి టిడిపి గెలుపులో కీలకపాత్ర పోషించిన పవన్‌కళ్యాణ్ 2019 ఎన్నికల నాటికి సొంతగా లేదా బిజెపితో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక దర్శకరత్న దాసరి నారాయణరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రతిపక్ష నేత జగన్‌ను, పవన్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. మరోవైపు దాసరి, జగన్‌లు ఒకటిగా కలిసిన తర్వాతే కాపు నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం కాపు రిజర్వేషన్లను తెరపైకి తెచ్చాడని టిడిపి భావిస్తోంది. అందుకు ధీటుగా ఎలా అందరికీ సమాధానం ఇవ్వాలా ? అని చంద్రబాబు అండ్ టీం ఆలోచనలో పడింది. ఇక వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ చంద్రబాబు తెరతీసిన 'ఆపరేషన్ ఆకర్ష్'కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వలస వచ్చే నేతలు ముందుగా మంచి రోజులను, ముహార్తాలను చూసుకుంటారు. కానీ ప్రస్తుతం మూడం కావడంతో ఎవ్వరూ టిడిపిలోకి జంప్ చేయకుండా మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో కొంతకాలం పాటు ఈ వలసలు ఆగిపోనున్నాయి. ఈ కాలాన్ని సరిగ్గా క్యాష్ చేసుకోవాలని జగన్ భావిస్తున్నాడు. కొంత వ్యవధి లభించింది కాబట్టి ఈలోపు పార్టీ మారే యోచనలో ఉన్న ఎమ్మేల్యేలను, నాయకులను ఎలాగోలా తన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పార్టీ మారిన వారు మరలా వచ్చే ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెస్‌లోకి రావాలని భావిస్తే.. ఎంత డబ్బిచ్చినా చేర్చుకునేది లేదని ఆయన తన ఎమ్మేల్యేలను హెచ్చరిస్తున్నాడు. అదే సమయంలో ఈ గ్యాప్‌తో చంద్రబాబును రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తే బాబు హవా తగ్గుతుందని, అందుకోసం ఆయన ర్యాలీలు, దీక్షలు చేసి ప్రజల్లో తనకున్న సత్తాను చాటిచెప్పి, చంద్రబాబు వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లితే ఈ వలసల పరంపర కాస్త ఆగుతుందనేది జగన్ వ్యూహరచనగా కనిపిస్తోంది. మరి చంద్రబాబును అన్ని వైపుల నుండి అష్టదిగ్బంధనం చేయాలని జగన్‌తో పాటు బిజెపి కూడా ఆలోచిస్తుండటం, దాసరివంటి వారు ముద్రగడ్డను మరలా ఉద్యమం వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుండటం, మరో పక్క పవన్ మద్దతు లేకుండా చేసుకోవడం... వంటి పరిణామాలతో చంద్రబాబు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.