అక్కినేని వారసుడు అఖిల్ తన మొదటి సినిమా 'అఖిల్' తో ఘోర పరాజయం పొందాడు. ఆ షాక్ నుండి ఇంకా తను తేరుకోలేదు. అందుకే ఇప్పటివరకు రెండో సినిమాను కూడా మొదలుపెట్టలేదు. కాని రీసెంట్ గా తన రెండో సినిమా మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అఖిల్. నా మొదటి సినిమా తరువాత చాలా ఆలోచించాను. ఏదైనా కొత్తగా ఉండే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఇదొక అర్బన్ లవ్ స్టోరీ. సమ్మర్ తరువాత షూటింగ్ మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాకు దర్శక నిర్మాతలు ఎవరనే విషయాన్ని చెప్పడానికి మాత్రం అఖిల్ నిరాకరించాడు. ఆ స్వేచ్చ తనకు లేదన్నాడు. కానీ 'ఊపిరి' సినిమా సమయంలో మాత్రం నాగార్జున స్వయంగా అఖిల్ తదుపరి సినిమా వంశీ పైడిపల్లితో ఉంటుందని చెప్పాడు. మరి అఖిల్ ఈ విషయం చెప్పడానికి వెనక్కి తగ్గాడంటే.. దర్శకుడు మారాడా..? అనే సందేహం కలుగుతుంది. ఇది ఇలా ఉండగా.. 'అఖిల్' సినిమా ఫెయిల్యూర్ సమయంలో నాన్నగారు 'ప్రపంచాన్ని కాపాడే వయసు నీకు ఇంకా రాలేదని' కామెంట్ చేశారని.. నాన్న చేసిన ఆ కామెంట్ నన్ను ఆలోచించేలా చేసిందని అన్నాడు. ఆ కామెంట్ నాకు ఎప్పటికి గుర్తుండి పోతుందని చెప్పాడు అఖిల్.