యాదృచ్చికమో.. చంద్రబాబు దురదృష్టమో తెలియదు కానీ బాబు సీఎంగా ఉన్న సమయంలోనే కరువు కోరలు చాచడం చంద్రబాబు వ్యక్తిగత ఇమేజ్‌కు కూడా ఇబ్బందిగా పరిణమిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబుపై విరుచుకుపడే ప్రతిపక్షం వైయస్సార్‌సీపీ ఈ విషయాన్ని బాగా హైలేట్ చేస్తోంది. కొంతకాలం కిందట రాజుకు బొల్లి ఉంటే పదవికి అనర్హుడని, పురాణాల్లో కూడా ఇదే విషయాన్ని చెప్పారని రోజా విమర్శలు చేసింది. ఇప్పుడు వైయస్సార్‌సీపీ ఎమ్మేల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ... చిత్తూరు జిల్లాలో ఇంతకు ముందెప్పుడు 48 డిగ్రీల ఉష్ణోగ్రత చూడలేదు. మహానుభావుడు చంద్రబాబు వల్లే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, ఈ పుణ్యమంతా చంద్రబాబుదే అని బాబును టార్గెట్ చేశాడు. ఆఖరికి ఎండల పేరు చెప్పి చంద్రబాబు హెరిటేజ్ మజ్జిగ అమ్ముకుంటున్నాడని... చంద్రబాబు, కరువు.. ఈ రెండు కవల పిల్లల్లా రాష్ట్రం మీద పడి జనాన్ని అల్లాడిస్తున్నాయని వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు సీఎం కుర్చీలో ఉంటే కరువు కూడా ఆయన వెంటే ఉంటుందని, నరకంలో కూడా జనం బతకవచ్చనే దానికి చంద్రబాబు పాలనే నిదర్శనం.. రాయలసీమ ప్రజలు కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారని ఆయన విమర్శించాడు. విమర్శలు చేయడాన్ని తప్పు పట్టకపోయినా ఇలా చంద్రబాబుకు, కరువుకు లింక్ పెట్టడం, ఆయన బాధపడుతున్న బొల్లి వ్యాధి వంటి వ్యక్తిగత విషయాలను ఇలా రాజకీయం చేయడం మాత్రం దారుణమనే చెప్పాలి.