సరిగ్గా మహానటుడు ఎన్టీఆర్ జయంతి (మే 28) సమయంలోనే నటుడు, ఎం.పి. మురళీమోహన్ కు ఒక విషయం గుర్తుకువస్తుంది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే విషయం. ఈ అరిగిపోయిన రికార్డ్ ను ఆయన దశాబ్దంకు పైగా వినిపిస్తున్నారు. తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన మహానటుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటాడు.
మురళీమోహన్ ఎన్టీఆర్ జయంతి వస్తుందనగానేఈ విషయాన్ని గుర్తుంచుకుని స్టేట్ మెంట్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఆవిషయమే మర్చిపోతారు. ఇలా సంవత్సరాలుగా జరుగుతోంది. తాజాగా మంగళవారం సైతం ఇదే స్టేట్ మెంట్ ఆయన రిపీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామిగా ఉంది. ఇద్దరు కేంద్ర మంత్రులు సైతం ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగల వెంకయ్యనాయుడు సైతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయిప్పటికీ ఎన్టీఆర్ కు భారతరత్న రావడం లేదు. లోపం ఎక్కడుంది. నిజానికి ఎన్టీఆర్ వంటి మహానేతకు పురస్కారాన్ని పదేపదే అడిగి ఇప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగువారికి రత్నంలాంటివారే.
నాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.జి.రామచంద్రన్ కు ఆయన చనిపోయిన ఏడాదిలోపే భారతరత్న ఇచ్చి గౌరవించింది నాటి కేంద్రప్రభుత్వం. కానీ తెలుగువాడైన ఎన్టీఆర్ కు మాత్రం ఈ విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై గట్టిగా పట్టుబడితే ఎప్పుడో భారతరత్న వచ్చేది. ఈ విషయం మురళీమోహన్ కు తెలియంది కాదు. తెలిసినా చొరవ తీసుకోరు. కేవలం ప్రకటనలు మాత్రం చేసి చేతులు దులుపుకుంటారు.