మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముందుచూపు ఒక్కోసారి మంచి ఫలితాన్నిస్తుంది. సోమవారం 'అ ఆ' సినిమా పాటల విడుదల వేడుక జరిగింది. శిల్పకళావేదికలో చేశారు. నితిన్ సినిమాకు అంత పెద్ద వేదికంటే కష్టం. ఎందుకంటే నితిన్ కు ఉన్న ఫాలోయింగ్ తక్కువే. పైగా ఇతర ప్రాంతాల నుండి కార్లు వేసుకుని వచ్చి చూసే అభిమానులు లేరు. ప్రతి సినిమాకు ఆడియో విడుదల హైలెట్ అవుతేనే బయ్యర్ల దృష్టి, ప్రజల దృష్టి ఆ సినిమావైపు మళ్ళుతుంది. ఇదంతా నితిన్ ను నమ్ముకుంటే జరగదు కాబట్టి ఆకర్షణ బలం ఉన్న పవన్ కల్యాణ్ వైపు త్రివిక్రమ్ చూపుతిప్పారు. తమ మధ్య ఉన్న స్నేహం ఆధారంగా ఆడియో వేడుకకు గెస్ట్ గా ఆహ్వానించారు. తన తదుపరి సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు. మంచి మిత్రుడు కావడంతో పవన్ కూడా రావడానికి అంగీకరించారు. అంతే పవన్ వస్తున్నాడని తెలియడంతో అ ఆ ఆడియో వేడుకకు ఒక్కసారిగా ఇంపార్టెన్స్ పెరిగింది. పాసుల కోసం డిమాండ్ వచ్చింది. పవన్ కోసం ఎక్కడెక్కడి నుండో అభిమానులు తరలివచ్చారు. సందడిగా వేడుక జరిగింది. త్రివిక్రమ్ ముందుకు చూపు 'అ ఆ'కు హైప్ తెచ్చిందని యూనిట్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.