వైకాపా నేత జగన్ వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఖాళీ అవుతోంది. వాటిని నిలువరించే ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. జగన్ కోటరి వ్యూహరచన విఫలమవుతోంది. నాయకత్వ పనితీరు నచ్చకే పార్టీ వీడుతున్నట్టు జంప్ చేస్తున్న నాయకులు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి కూడా తెరాస తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఇది వైకాపాకు పెద్ద షాక్. వేసవి వేడిలో మరింత వేడి రగిలించే చర్య . ఆంధ్రప్రదేశ్ లో తెదేపా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపించిన జగన్ తెలంగాణలో మాత్రం ప్రలోభాల కారణంగా తమ వాళ్లు తెరాసలోకి వెళుతున్నారంటున్నారు. పొంగులేటి అమ్ముడుబోయాడని అనలేకపోయారు. ఎందుకంటే పొంగులేటి ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి. ఇప్పటి వరకు తెలంగాణలో వైకాపాను ఆర్థికంగా ఆదుకున్నది కూడా ఆయనే.
వలసలకు పులిస్టాప్ పెట్టడానికి జగన్ ధర్నా అస్త్రం ప్రయోగించారు. చంద్రబాబు పాలనపై, కరవుపై, ప్రాజెక్ట్ లపై ఒకే సారి ఆరోపణలకు దిగారు. తెలంగాణ ప్రాజెక్ట్ లు ఆంధ్రకు నష్టం తెస్తాయంటూ మూడు రోజుల ధర్నా షెడ్యూల్ ప్రకటించగానే పార్టీలో లుకలుకలు మరింత పెరిగాయి. ఏకంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడే జండా మార్చేశారు. ఈ పరిణామం పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ధర్నా వల్ల ఉపయోగమేమిటని పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రాంతీయవాదం ఊపిరి పోసుకుంటుంది. తెలంగాణలో ఉన్న ఆంధ్రులు ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో జగన్ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందనే దానిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. చంద్రబాబును టార్గెట్ చేయాలనే ఆలోచనతో తెలుగు ప్రజల మధ్య వైరం పెంచే పనుల కంటే అక్రమమని చెబుతున్న ప్రాజెక్ట్ లపై న్యాయ పోరాటం చేయడం సరైన చర్య. గతంలో కర్నాటక ప్రాజెక్ట్ లపై అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ మార్గంలోనే వెళ్ళాయి.