పవన్‌కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రం వెనక ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ ఉన్నాడని... ఆయనే పవన్‌కి పొలికటల్ స్క్రిప్టు, స్క్రీన్‌ప్లే రాస్తుంటాడని తెలుగు రాష్ట్రాల్లోని జనాలు మాట్లాడుకుంటుంటారు. నిజంగా పవన్ రాజకీయ రంగ ప్రవేశం వెనక త్రివిక్రమ్ పాత్ర ఎంతుందో తెలియదు కానీ... ఆయన తనకి స్క్రిప్టు మాత్రం రాసివ్వడం లేదని ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు పవన్. అస్తమానం స్క్రిప్టు రాసివ్వకపోవచ్చేమో కానీ... 'అఆ' ఆడియో వేడుకలో మాట్లాడిన మాటలు విన్నాక పవన్‌ని రాజకీయ నాయకుడిగా చూడాలన్న కోరిక మాత్రం త్రివిక్రమ్‌కి బలంగా వుందన్న విషయం మాత్రం నిరూపితమయ్యింది.
ఆదర్శభావాలున్న వ్యక్తి త్రివిక్రమ్. సమాజం బాగుండాలనే కోరిక ఆయనలో మెండుగా కనిపిస్తుంటుంది. అలాంటి ఆశయం నెరవేరాలంటే ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ వున్న పవన్‌కళ్యాణ్‌తోనే సాధ్యమని నమ్ముండొచ్చు. పవన్ అభిప్రాయాలు, ఆలోచనలు కూడా త్రివిక్రమ్‌కి దగ్గరగానే వుంటాయి. అందుకే ఇద్దరూ అంతగా కలిసిపోయారు. వాళ్లిద్దరూ మాట్లాడుకొనే.. రాజకీయాలపై ఓ నిర్ణయానికొచ్చుండొచ్చన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. పవన్‌కళ్యాణ్‌ని త్రివిక్రమ్ ఒక అస్త్రంగా భావిస్తున్నాడన్న విషయం ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమైంది. అందుకే 'పవన్‌కళ్యాణ్... నేను దాచుకున్న నా సైన్యం .. నేను శత్రువుపై చేసే యుద్దం.. నేను ఎక్కుపెట్టిన బాణం... నా పిడికిట్లో ఉన్న వజ్రాయుదం... నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు .. ఎంతోమంది గుండెలు తడపడానికి వచ్చే వాన చినుకు ...' అంటూ 'అఆ' వేడుకలో మాట్లాడాడు త్రివిక్రమ్. 'ఆయన మాట వింటారా... వెనకాలే వస్తారా... తోడుగా ఉందాం వస్తారా...' అంటూ అభిమానులకి కూడా పిలుపునిచ్చారు. ఆ మాటలకి అభిమానుల నుంచి పెద్దయెత్తున స్పందన లభించింది.