Advertisement

సేవ్‌ డెమొక్రసీ కాదు.. సేవ్‌ వైకాపా!

Tue 03rd May 2016 10:12 PM
save democracy,save ysrcp,delhi,jagan tour,chandrababu,tdp aakarsh,ys jagan  సేవ్‌ డెమొక్రసీ కాదు.. సేవ్‌ వైకాపా!
సేవ్‌ డెమొక్రసీ కాదు.. సేవ్‌ వైకాపా!
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అత్యంత వికృతంగా తయారయ్యాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్యేల్యేలు వరుసపెట్టి తెలుగుదేశంలో చేరుతున్నారు. చంద్రబాబు అభివృద్దిని చూసి ఆనందం తట్టుకోలేక తెలుగుదేశంలో చేరుతున్నామని వీళ్లందరూ చెప్పుకుంటున్నా, విని చప్పట్లు కొట్టేంత అమాయక స్థితిలో ప్రజలు లేరు. ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారన్నది ప్రజలకు బాగానే తెలుసు, పార్టీ మారుతున్న ఎమ్మేల్యేలను గురించి పబ్లిక్‌లో ప్రజలు ఏమని మాట్లాడుకుంటున్నారో వింటే.. ఆత్మాభిమానం ఉన్న వాళ్లెవరైనా గుండె ఆగి చస్తారు. అంత నీచంగా జనాలు తిడుతున్నారు. ఆదినారాయణరెడ్డి, భూమానాగిరెడ్డిలతో మొదలైన వలసల పర్వం ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్‌ వరకు వచ్చింది. అయితే ఇది ఇక్కడితో ఆగేట్లు లేదు. ఈ పరంపర ఇంకా కొనసాగేట్లు ఉంది. ఎమ్యేల్యేల కొనుగోలుకు తెరతీయడం ద్వారా చంద్రబాబు ఒక విష సంస్కృతికి శ్రీకారం చుడితే... ప్రతిపక్ష నేతగా జగన్‌ నాయకత్వ లోపం కూడా ఫిరాయింపులను ప్రోత్సహించేదిగా ఉండడం విచారకరం. 'సేవ్‌ డెమొక్రసీ' అంటూ వైయస్‌ జగన్‌ తన పార్టీ నాయకులను వెంటబెట్టుకొని ఢిల్లీ అంతా కలతిరిగాడు. రాజ్‌నాద్‌సింగ్‌, సీతారాం ఏచూరి, శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌ వంటి జాతీయ నాయకులను కలిశారు. చంద్రబాబు అవినీతిపై ముద్రించిన 'అవినీతి చక్రవర్తి' పుస్తకాలను ఢిల్లీలో పంచిపెట్టాడు. ఏపీలో జరుగుతున్న ఎమ్యేల్యేల బేరసారాలను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకురావడంలో జగన్‌ కొంత సఫలమైనట్లే..! 

ఏపీలో హోల్‌సేల్‌గా ఎమ్మేల్యేలను కొంటున్నారనే విషయం అందరికీ అర్థమైపోయింది. అయితే ఎవరు కూడా దీనిలో వేలుపెట్టి ఆపే పరిస్థితి, అవసరం లేదు కూడా...! చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే...! జగన్‌ 'సేవ్‌ డెమొక్రసీ'కి ముందు 'సేవ్‌ వైకాపా' ఆపరేషన్‌ చేపట్టి ఉంటే బాగుండేది. తన పార్టీ ఎమ్మేల్యేలతో నిత్యం టచ్‌లో ఉంటూ, ఎవరన్నా పార్టీ మారే వాతావరణం కనిపించినప్పుడు వారితో చర్చించి ఉంటే బాగుండేది, అవతల ప్రలోభాల ప్రభావం చాలా తీవ్రంగా ఉండి, అయస్కాంతంలా ఆకర్షిస్తున్నప్పుడు బలహీనమైన మనసున్న ఎమ్యేల్యేలను కట్టడి చేయడం కూడా కష్టమే...! అలాంటి బలహీన లక్షణాలున్న ఎమ్మెల్యేలను కనిపెట్టి వారిని దారిలోకి తెచ్చుకుని ఉండాల్సింది. భూమా నాగిరెడ్డి పిఎసీ చైర్మెన్‌ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిని కాపు వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రూకు ఇచ్చి ఉండాలి. వైకాపాకు దక్కే ఒక్క రాజ్యసభ స్ధానాన్ని విజయసాయిరెడ్డి కోసం ఎత్తిపెట్టామని చెబుతున్నారు. ఆయన వైఎస్‌ ఇంట్లో మనిషి. ఆయనకు బదులు పార్టీకి రాజకీయంగా, ఆర్ధికంగా అండగా నిలిచిన ఎంవీ మైసూరారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వంటి వారిని పరిగణనలోకి తీసుకొని ఉండాలి. కాని అలా చేయకపోవడం వల్లే వీళ్లు సైతం పార్టీని వదిలిపోయారు. సేవ్‌ డెమొక్రసీ అంటూ జగన్‌ ఢిల్లీ వీధుల్లో ఎలుగెత్తి అరిచినంత మాత్రాన ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్లెవరూ లేరు. భారత దేశ రాజకీయమే ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న దొంగల రాజ్యం. ఇక్కడ అందరూ దొంగలే....! కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడే మాట పక్కనపెట్టి జగన్‌ ముందు తన పార్టీని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement