పరభాషా హీరోలు మరీ ముఖ్యంగా తమిళ హీరోలు తెలుగునాట మన హీరోల స్థాయికి తగ్గట్లుగా ఇమేజ్‌ను పెంచుకుంటున్నారు. ఇక మన స్టార్స్ మాత్రం నిన్న మొన్నటివరకు కేవలం తెలుగుభాషా చిత్రాలపైనే ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు మన స్టార్స్ కూడా తమిళం, మలయాళం వంటి భాషల్లో గుర్తింపు తెచ్చుకుని తమ మార్కెట్‌ను పెంచుకోవాలని డిసైడ్ కావడం శుభపరిణామం. ప్రస్తుతం మహేష్‌బాబు నటిస్తున్న 'బ్రహ్మోత్సవం'చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఒకే రోజున తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత కూడా మహేష్ మురుగదాస్‌తో చేసే సినిమా, ఆ తదుపరి విక్రమ్ కె.కుమార్‌తో చేసే సినిమాలను బైలింగ్వల్ ఫిల్మ్స్‌గా తెరకెక్కించనున్నాడు. ఇక మన తెలుగు స్టార్స్‌లో అందరికంటే ముందుగా మాలీవుడ్‌కి వెళ్లి అక్కడ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న స్టార్ బన్నీ. కాగా బన్నీకి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు బన్నీ తమిళంపై ఫోకస్ పెట్టాడు. లింగుస్వామితో చేయబోయే చిత్రం, ఆ తర్వాత విక్రమ్.కె.కుమార్‌లతో చిత్రాల ద్వారా ఆయన తమిళ బాక్సాఫీస్‌ను కూడా బద్దలు కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇక 'బాహుబలి' చిత్రంతో అన్ని వుడ్‌లలోనూ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ నటించిన పాత చిత్రాలు వరుసగా తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌లుగా విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం తాను చేస్తున్న 'బాహుబలి- ది కంక్లూజన్'తో పాటు ఆపై చేసే చిత్రాలను కూడా ప్రభాస్ అన్ని భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. చివరకు గోపీచంద్ కూడా తమిళ మార్కెట్‌పై కన్నేశాడు. బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్-నయనతార జంటగా నటిస్తున్న చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కింది. కానీ ఈ చిత్రం విడుదలకు ఇంకా నోచుకోలేదు. తాజాగా ఆయన జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎం.యం.రత్నం నిర్మిస్తున్న 'ఆక్సిజన్' చిత్రం కూడా ద్విభాషాచిత్రంగా రూపొందనుండటం విశేషం.