రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వైకాపా నుండి తెలుగుదేశంలోకి జోరుగా వలసలు సాగుతున్నా నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటివరకు కాస్త గట్టిగానే నిలబడ్డారని చెప్పవచ్చు. ఇంతవరకు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాత్రమే తెలుగుదేశంలోకి వెళ్లారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన మీద ప్రస్తుతానికి అనుమానాలు లేవు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్‌లు జగన్ పట్ల విశ్వాసంగా ఉన్నారు. ఇక తెలుగుదేశం నాయకులు సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు గాలం వేశారు. అయితే అతను విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఉద్యోగం వదులుకొని వస్తే నాకు సీటిచ్చి ఎమ్మెల్యేను చేసింది జగన్. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే ఎమ్మెల్యే పదవినే వదులుకుంటానని చెప్పి, రాజకీయాలలో ఇంకా అంతో ఇంతో నైతిక విలువలు బతికి ఉన్నాయని చాటాడు. ఉన్న సందేహమల్లా కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిల పైనే..! వీళ్లిద్దరి మీద ఎన్నికల నాటి నకిలీ మద్యం కేసులున్నాయి. వీటిని మొదటి నుంచి బూచిగా చూపించి వాళ్లను లాగేసుకునేందుకు తెదేపా నాయకులు చాలా కాలంగా ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. వీరిద్దరితోనూ 'దేశం' నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. కేసుల దెబ్బకు భయపడితే వీళ్లు వైకాపాను వీడే అవకాశాలను కొట్టిపారేయలేం.