రాష్ట్ర కేబినెట్ విస్తరణ పలువురు నాయకులను ఊరిస్తోంది. ఆశావాదులను పెంచుతోంది. ముఖ్యంగా విస్తరణలో నెల్లూరుజిల్లా నాయకులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మంత్రివర్గం నుండి నారాయణను తప్పించి, ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా చంద్రబాబు నియమించవచ్చునని సమాచారం. అంటే మంత్రి కన్నా కూడా ప్రాధాన్యం కలిగిన పోస్ట్. దివంగత నేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కెవిపి రామచంద్రరావు నిర్వహించిన పదవి అన్నమాట..! నారాయణ మంత్రిగా ఉంటే అందరిలో ఒకడు. అదే ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయితే చంద్రబాబు తర్వాత అంత హోదా అన్న పేరొస్తుంది. అందరు మంత్రులపై కూడా అజమాయిషీ చేయవచ్చు. మంత్రిగా ఫెయిలయ్యాడని, ఏ పని చేయలేకపోతున్నాడనే ఆరోపణలు తప్పుతాయి. ఆయనను మంత్రి వర్గం నుండి తప్పిస్తే నెల్లూరు జిల్లా నుండి పార్టీని నడిపించేవారికి మంత్రి పదవి అప్పగించవచ్చు. ఈ కోణంలో చూస్తే క్యాబినెట్ విస్తరణలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అవకాశాలు మెరుగయ్యాయి. అయితే ఇద్దరిలో ఒకరికే చాన్స్ ఉంటుందా? లేక ఇద్దరికీ దక్కుతుందా? అనేది చూడాలి.
ఈమధ్య కాలంలో చూస్తే జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సోమిరెడ్డి అవసరం బాగా కనిపిస్తోంది. లీడర్లను, కేడర్‌ను ఏకతాటిపైకి తేగల ఘనుడు చంద్రమోహన్‌రెడ్డి, ప్రభుత్వానికి పాజిటివ్‌గా మాట్లాడి ప్రజలను మెప్పించడంలోనూ, ప్రతిపక్షంపై ఆధారాలతో కూడిన విమర్శలు చేయడంలోనూ సోమిరెడ్డి సిద్దహస్తుడు. జిల్లా పార్టీలో అధికశాతం కార్యకర్తలు సోమిరెడ్డినే మంత్రిగా కోరుకుంటున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడింది సోమిరెడ్డేననే అభిప్రాయం కూడా కేడర్‌లో వ్యక్తం అవుతోంది. క్యాబినెట్ విస్తరణలో రెడ్లకు పెద్దపీట వేసే దృష్ట్యా సోమిరెడ్డికి అవకాశాలు మెరుగ్గా ఉండగా, మధ్యలో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా మంత్రి పదవి ఖాయమనే వార్తలొస్తున్నాయి. మాగుంట ప్రకాశం జిల్లా నుండి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఏ జిల్లా ప్రతినిధులను ఆ జిల్లా వరకే లెక్కలోకి తీసుకుంటే సోమిరెడ్డి అవకాశాలు సజీవంగా ఉంటాయి. అలాకాకుండా మాగుంట శ్రీనయ్యను నెల్లూరు లెక్కలోకి తీసుకుంటే సోమిరెడ్డికి తలనొప్పే. ఎందుకంటే జిల్లా నుండి ఒక రెడ్డికి మాత్రమే ఛాన్సుంటుంది. మాగుంట శ్రీనయ్యను నెల్లూరు లెక్కలోకి తీసుకుంటే మాత్రం నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డిని పక్కనపెట్టి బీదరవిచంద్ర పేరును కూడా పరిశీలించే అవకాశముంది...!