ఎవరెన్ని అనుకున్నా మే 6వ తేదీన విడుదలకు సిద్దమవుతున్న సూర్య - విక్రమ్‌కుమార్‌ల 24 చిత్రం ఎఫెక్ట్ దిల్‌రాజు నిర్మాణంలో సాయిధరమ్‌తేజ్ హీరోగా, అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సుప్రీమ్ చిత్రంపై పడనుందనేది వాస్తవం. సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్‌తో పాటు ఈ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. కాగా 24 చిత్రం మే 6న విడుదల కానుండగా సుప్రీమ్ చిత్రం ఒకరోజు ముందుగా మే 5నే విడుదల కానుంది. కాగా సుప్రీమ్ చిత్రానికి సంబంధించిన రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. నైజాంలో సైతం ఈ చిత్రాన్ని దిల్‌రాజు అభిషేక్ పిక్చర్స్ వారికి ఫ్యాన్సీ రేటుకు అమ్మాడు. కానీ ఈ చిత్రానికి ఓవర్‌సీస్ రైట్స్ మాత్రం అమ్ముడుకాలేదు. ఈ చిత్రం ఓవర్‌సీస్ రైట్‌ను 1.50 కోట్లు చెప్పడంతో అంత మొత్తం చెల్లించి సినిమాను రిలీజ్ చేయడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదు. అందులో 24 చిత్రం కూడా పక్కరోజునే విడుదల కానుండటం, ఓవర్‌సీస్‌లో మాస్ చిత్రాల కంటే వైవిధ్యమైన చిత్రాలకే ఎక్కువ క్రేజ్ ఉండటం కూడా ఓవర్‌సీస్ రైట్స్ అమ్ముడుపోకపోవడానికి ముఖ్యకారణంగా చెబుతున్నారు. దీంతో దిల్‌రాజు తనకు బాగా ఆప్తులైన ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని తనే సొంతగా ఓవర్‌సీస్‌లో రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. మరి ఈ చిత్రం దిల్‌రాజుకు ఎలాంటి ఫలితం ఇస్తుందో వేచిచూడాల్సి వుంది.