హైదరాబాద్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం నేడు తన ప్రభావాన్ని కోల్పోతోంది. ఈ పార్టీ కార్యాలయానికి నాయకుల రాక తగ్గటంతో బోసిపోతోంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఎన్టీఆర్ భవన్ ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో నిన్నటి ఎన్నికల వరకు కళకళలాడింది. బాబు సీఎం అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1996లో దీన్ని నిర్మించారు. అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్‌కు దగ్గరగా నిర్మించిన ఈ కార్యాలయ స్థలం ప్రభుత్వానిది. తెలుగుదేశం పార్టీ ఈ స్థలాన్ని 100 సంత్సరాల లీజుకు తీసుకుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంద్రప్రదేశ్‌లో టిడిపి అధికారంలోకి రావడం, తెలంగాణలో తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకొని రావడానికి వారానికి నాలుగురోజులు పార్టీ కార్యాలయానికి వస్తానని చంద్రబాబు సైతం చెప్పారు. ఇప్పటికీ తెలంగాణ టిడిపి నేతలు వారానికి నాలుగు రోజులు ఇక్కడకు రావాలని చంద్రబాబును కోరుతున్నారు. అయితే ఓటుకు నోటు తర్వాత చంద్రబాబు ఇక్కడకు రావడానికి ఇష్టపడటం లేదు. తన పార్టీ కార్యకలాపాలను, ప్రభుత్వ కార్యకలాపాలను విజయవాడ-గుంటూరుల నుండే నడుపుతున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు ఇక్కడకు తరచుగా నారా లోకేష్ వచ్చేవాడు. కానీ ఆ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన కూడా ఇక్కడకు రావడం మానివేశాడు. ఇక ఇద్దరు అధినేతలే రానప్పుడు పార్టీ కార్యాలయానికి తాము వచ్చినా లాభమేమీ లేదని టిటిడిపి నేతలు భావిస్తున్నారు. తెలంగాణ పార్టీకి సంబంధించిన విషయాలకు సంబంధించి ఏవైనా మీటింగ్‌లు ఉంటే తెలంగాణ నేతలే విజయవాడకు వస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో రాజకీయాలు, ఇతర అంశాలపై చంద్రబాబు కూడా నిర్లిప్తత చూపిస్తున్నారు. తెలంగాణ విషయంలో ఆయన ఏమాత్రం చురుగ్గా లేడు. హైదరాబాద్ తనకు అతి భద్రమైన ప్రదేశం కాదనే నిర్ణయానికి ఆయన వచ్చేశాడు. ఏడెకరాల ఈ పార్టీ కార్యాలయంలో ప్రస్తుతం ఎన్టీఆర్ బ్లడ్‌బ్యాంకు కార్యకలాపాలు, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ కేంద్ర కార్యాలయం, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన మెటీరియల్ తయారీ వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఈ భవనం మెయిన్‌టెనెన్స్‌కు కూడా ఆదాయం రాకపోవడంతో చేతి డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తోందట. అందుకే త్వరలో బ్రాహ్మణి సారధ్యంలో ఓ ఉమెన్స్ డిగ్రీ కాలేజీని ఈ ఆవరణలోనే ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. అయినా ఎంతో వైభవం కలిగిన ఈ కార్యాలయానికి చంద్రబాబు భయపడి రావడం లేదనే మాట మాత్రం వాస్తవం.